హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను అనుమతించాలనే ప్రధాన డిమాండ్లతో ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. ఆర్టీసీ జేఏసీ ఆ దిశగా కార్మికలను సమ్మెకు సమాయత్తం చేస్తున్నది. లేబర్ కమిషనర్ తో జరిపిన చర్చలు విఫలం కావడం, ఈ రెండు ప్రధాన డిమాండ్లు మినహా మిగతా సమస్యలపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేయడంతో ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో 21వ తేదీ అర్ధరాత్రి నుంచి.. అంటే 22వ తేదీ మొదటి షిప్ట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. మెజార్టీ యూనియన్లు సమ్మెకు మద్దతు పలకడం, జేఏసీ నేతలు గత 15 రోజులుగా డిపోల వారీగా పర్యటిస్తూ కార్మికులను సమాయత్తం చేయడంతో సమ్మెను సక్సెస్ చేసి తమ డిమాండ్లను సాధించుకోవడంపై జేఏసీ నేతలు దృష్టి పెట్టారు.
ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థపై జేఏసీ సమ్మె ప్రభావం పడకుండా ఉండేందుకు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మికులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే వారికి వేతన సవరణపై ప్రకటన చేసేందుకు కూడా ఆర్టీసీ సిద్ధమవుతున్నది. యూనియన్లలోని కొన్ని సంఘాలు ఇప్పటి వరకు సమ్మెపై స్పష్టత ఇవ్వకపోవడంతో అలాంటి సంఘాలను కూడగట్టి సమ్మెకు కార్మికులను దూరంగా ఉంచాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అయితే జేఏసీ ఇచ్చిన సమ్మె పిలుపు ప్రభావం ఏ మేరకు ఉంటుంది, దానికి ప్రత్యామ్నాయ చర్యలు ఏమిటనే దానిపై అధికారులు దృష్టిపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో జరగనున్న ఈ మొదటి సమ్మెపై కార్మిక వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

