ఆర్టీసీ కార్మికులకు కంటి తుడుపు చర్యగా రెండు డీఏలు ఇచ్చిన్రు : టీఎంయూ

ఆర్టీసీ కార్మికులకు కంటి తుడుపు చర్యగా రెండు డీఏలు ఇచ్చిన్రు : టీఎంయూ

హైదరాబాద్: మునుగోడు బై పోల్ నేపథ్యంలోనే ఆర్టీసీ కార్మికులకు డీఏ ప్రకటించారని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు అశ్వథ్థామ రెడ్డి, తిరుపతి మండిపడ్డారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన టీఎంయూ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి వైఖరి సరిగ్గా లేదని విమర్శించారు.కార్మికులకు రావాల్సిన పే రివిజన్, బాండ్ల డబ్బులు, సీసీఎస్ బకాయిలు, ఉద్యోగ భద్రత లాంటి అంశాలను పక్కనపెట్టి.. కంటి తుడుపు చర్యగా రెండు డీఏలు ఇచ్చారని ఫైర్ అయ్యారు.  

తెలంగాణ కోసం జరిగిన సకల జనుల సమ్మెకు సంబంధించిన బకాయిలు ఇప్పటివరకు చెల్లించని ప్రభుత్వం.. ఎన్నికల వేళ తప్పుడు ప్రచారాలు చేసుకుంటోందని ఆరోపించారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు రెగ్యులర్ గా చేపట్టడంతో పాటు 2013 నాటి బాండ్ల డబ్బుల చెల్లింపులు జరపాలని డిమాండ్ చేశారు.  కంటి తుడుపు చర్యలతో మభ్యపెట్టాలని చూస్తే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని టీఎంయూ నాయకులు హెచ్చరించారు.