- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించిన ప్రభుత్వానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఆర్టీసీ కార్మికుల విజయమని అభివర్ణించారు. పదేండ్ల కాలంలో విచ్ఛిన్నమైన ఆర్టీసీని మళ్లీ గాడిలో పెట్టేందుకు కార్మికుల మనోగతానికి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం అభినందనీయమని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్మికుల డిమాండ్ల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ వేంనరేందర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గత ప్రభుత్వ ఆర్టీసీలో యూనియన్లను రద్దు చేయడం దుర్మార్గమని విమర్శించారు. కార్మికులకు మళ్లీ యూనియన్లు కలిగి ఉండే హక్కు కల్పించడంతో వారికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం వచ్చినట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు. ఆర్టీసీ విలీనం ప్రక్రియపై కార్మిక సంఘాలతో కమిటీ వేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 11 శాతం పీఆర్సీని అమలు చేయడం శుభపరిణామం అని తెలిపారు.

