ఫ్లైట్ జర్నీకి నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి చేసిన మహా సర్కార్

ఫ్లైట్ జర్నీకి నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి చేసిన మహా సర్కార్

ముంబై: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతోంది. మిగిలిన వేరియంట్ ల కంటే కూడా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అన్ని దేశాలు అలర్ట్ అవుతున్నాయి. భారత్ కూడా ఈ వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో పెంచుకుని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి మహారాష్ట్రకు వచ్చేందుకు ఇకపై ప్లాన్ చేసుకునే వారు తప్పనిసరిగా 7 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా, ఇప్పటికే ప్లాన్ చేసుకున్న వారికి రెండ్రోజులు క్వారంటైన్ లో ఉండాలని సూచించింది.  

ముంబై నుంచి విమాన ప్రయాణాలు చేసే వారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని ఉద్ధవ్ థాక్రే సర్కార్ ఆదేశించింది. డొమెస్టిక్ ట్రావెల్ చేసే వారు ప్రయాణానికి ముందు 72 గంటల్లోగా ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టును సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు మహా సర్కారు పలు నిబంధనలు విధించింది.

మహారాష్ట్రలో డిసెంబర్ 2 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..

  • ప్రయాణానికి ముందు72 గంటల్లోగా ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాలి. కొవిడ్ నెగెటివ్ రిపోర్టు ఉంటేనే ట్రావెలింగ్ కు అనుమతించాలని అన్ని డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ సంస్థలకు ముంబై ఎయిర్ పోర్టు ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సందర్భాల్లో ఎయిర్ పోర్టులోనే టెస్టులు చేయడానికి అనుమతిస్తారు. 
  • విమాన ప్రయాణికులు తప్పనిసరిగా రెండ్రోజులు క్వారంటైన్ లో ఉండాలని మహారాష్ట్ర సర్కారు ఆదేశించింది. అయితే ఇప్పటికే ప్రభావిత దేశాల నుంచి మహారాష్ట్రకు రావడానికి ముందే ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి ప్రయాణికులకు మరికొంత సమయం ఇవ్వాలని కేంద్రం ఓ నోట్ లో మహా సర్కారుకు సూచించింది. 
  • ఒమిక్రాన్ రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కేంద్ర సూచనలను ఉద్ధవ్ సర్కారు పరిగణనలోకి తీసుకుంది. దీనిపై పునరాలోచన చేసింది. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా వారి ట్రావెల్ ప్లాన్స్ ను మార్చుకునేందుకు రెండ్రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది.