- 400 ప్రభుత్వ క్యాంటీన్లలో రూ.5లకే ఫిష్ రైస్ అందిస్తామని వెల్లడి
కోల్‌కతా: బెంగాల్ సర్కార్ అక్రమ వలసదారులపై చర్యలు చేపట్టింది. అధికారులు వెతుక్కుంటూ వచ్చి పట్టుకోకముందే పారిపోవాలంటూ సీఎం సువేందు అధికారి బంగ్లా చొరబాటుదారులను హెచ్చరించారు. అక్రమంగా ఉంటూ పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మంగళవారం ఆయన నాడియా జిల్లాలోని కళ్యాణిలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం సువేందు మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటికే అమల్లో ఉన్న ‘ఫారినర్స్ యాక్ట్ (విదేశీయుల చట్టం)’ ప్రకారమే రాష్ట్రంలోని చొరబాటుదారులపై చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు.
వలసదారుల కోసం ఎలాంటి కొత్త చట్టాన్ని తీసుకురాలేదని స్పష్టం చేశారు. తమ దేశ పౌరులను తిరిగి సరిహద్దు దాటించి భూభాగంలోకి చేర్చుకోవడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా సుముఖంగా ఉందన్నారు.
పట్టుబడిన అక్రమ వలసదారులను జైలుకు పంపించి, భారత ప్రభుత్వ వనరులను వారిపై వృధా చేయవద్దని తాను ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సీఎం వెల్లడించారు. ‘మన దేశ వనరులను చొరబాటుదారుల కోసం ఎందుకు ఖర్చు చేయాలి? వారికి రాచమర్యాదలతో ఆతిథ్యం ఇవ్వడానికి వారేమైనా మన ఇంటి అల్లుళ్లా?’ అని సువేందు అధికారి ఘాటుగా వ్యాఖ్యానించారు.
రూ.5కే ఫిష్ రైస్
బెంగాలీ ప్రజల సాంప్రదాయ ఆహార గుర్తింపును గౌరవిస్తూ సీఎం సువేందు మరొక సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సుమారు 400 ప్రత్యేక క్యాంటీన్లలో కేవలం రూ. 5 లకే ఫిష్ అండ్ రైస్ మీల్స్ (మాచ్ భాత్)తో కూడిన సబ్సిడీ భోజనాన్ని అందించనున్నట్లు వెల్లడించారు.
గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజల ప్రధాన ఆహారాలైన చేపలు, మాంసం, గుడ్లపై నిషేధం విధిస్తుందని ప్రచారం చేశారు. టీఎంసీ చేసిన ఆ దుష్ప్రచారాన్ని, ప్రజల్లో ఉన్న అపోహలను పూర్తిగా తిప్పికొట్టడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
