రూపాయి బలపడితేనే మన జీడీపీ ముందుకు.. ఆరోస్థానానికి పడిపోయిన ఆర్థిక వ్యవస్థ

రూపాయి బలపడితేనే  మన జీడీపీ ముందుకు..  ఆరోస్థానానికి పడిపోయిన ఆర్థిక వ్యవస్థ
  • దిగుమతులు తగ్గాలి..ఎగుమతులు పెరగాలి
  • ఇరాన్ వార్ ముగిశాక తిరిగి నాల్గో స్థానానికి!

న్యూఢిల్లీ: ఇండియా ఆర్థిక వ్యవస్థ కిందటేడాది గ్లోబల్‌‌‌‌గా నాల్గో స్థానానికి చేరింది. జపాన్‌‌, యూకేని దాటి దూసుకుపోయింది. ఇక నెక్స్ట్‌‌ స్టాప్ మూడో ప్లేస్ అని అనుకుంటున్న టైమ్‌‌లో మళ్లీ ఆరో స్థానానికి పడిపోయింది. దీనికి ప్రధాన కారణం రూపాయి విలువ భారీగా పడిపోవడమే. గ్లోబల్ స్టేజ్‌‌లో  స్ట్రాంగ్‌‌గా నిలబడాలంటే  మన కరెన్సీ కూడా అంతే స్ట్రాంగ్‌‌గా ఉండాలి. రూపాయి బలహీనంగా ఉంటే ఇండియా ఆర్థిక వ్యవస్థ ముందుకు  కదల్లేదు.  

స్వదేశీ జాగరన్ నేషనల్ కో కన్వినర్‌‌‌‌, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెషర్‌‌‌‌ అశ్వని మహాజన్‌‌ ప్రకారం, రూపాయి విలువ పడిపోవడంతోనే ఇండియా జీడీపీ వృద్ధి నెమ్మదించింది. భారత్ 2014 నుంచి 2026 మధ్య ఏటా సగటున 10శాతం నామినల్ వృద్ధిని, 6–6.5 శాతం  రియల్ జీడీపీ వృద్ధిని సాధించగా,  ఇదే టైమ్‌‌లో  రూపాయి విలువ డాలర్‌‌తో ఏటా 3.5శాతం నుంచి 4 శాతం మేర క్షీణిచింది. ఇరాన్‌‌–అమెరికా యుద్ధ ప్రభావంతో  ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌లో రూపాయి విలువ  2శాతం పడిపోగా,  గత ఏడాది కాలంలో 10–11 శాతం క్షీణించింది. దీంతో  ఇండియా జీడీపీని డాలర్లలో లెక్కించినప్పుడు కిందటేడాది ఉన్న 4.18 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.15 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. 

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్‌‌) ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్‌‌లో  జపాన్‌‌ జీడీపీ  4.38 ట్రిలియన్ డాలర్లకు, యూకే జీడీపీ 4.26 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఈ దేశాల కరెన్సీలు కూడా డాలర్‌‌‌‌తో పడిపోయినా, మన కరెన్సీ కన్నా కొంచెం మంచి పెర్ఫార్మెన్స్ చేశాయి.  మరోవైపు ఈ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరగడంతో కూడా జీడీపీ ఎక్కువలా కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంటే తయారైన ప్రొడక్ట్‌‌ల విలువ (జీడీపీ) ఎక్కువగా ఉంటుంది. ఇది రియల్ జీడీపీని చూపించకపోయినా, గ్లోబల్‌‌ స్టేజ్‌‌లో ఈ దేశాలు ఇండియాను అధిగమించాయనడం నిజం.

రూపాయిని  బలోపేతం చేయాలి..

కరెన్సీ విలువ అనేది డాలర్ల డిమాండ్, సప్లయ్‌పై ఆధారపడి ఉంటుంది. మన దేశానికి డాలర్లు రావాలంటే ఎగుమతులు,  విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌‌డీఐ),  విదేశాల్లో ఉన్న భారతీయులు పంపే నిధులు (రెమిటెన్స్‌‌) పెరగాలి. అయితే, మన దిగుమతులు, ముఖ్యంగా చైనా నుంచి భారీగా పెరగడం వల్ల వాణిజ్య లోటు (ట్రేడ్‌‌ డెఫిసిట్) ఎక్కువైంది. 2025–-26లో చైనాతో వాణిజ్య లోటు 112.1 బిలియన్ డాలర్లకు చేరింది. దీనర్ధం ఇండియాలోకి వచ్చే డాలర్ల కంటే మనం చెల్లిస్తున్న డాలర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. రూపాయిని బలోపేతం చేయాలంటే  అనవసరమైన దిగుమతులను తగ్గించుకోవడం ముఖ్యం.  

అలానే ఫారిన్ ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎఫ్‌‌ఐఐల) ను ఆకర్షించాలి. వీరు ఇండియా మార్కెట్ నుంచి వెళ్లిపోకుండా చర్యలు తీసుకోవాలి. క్రూడాయిల్‌‌ వాడకాన్ని, బంగారం దిగుమతులను తగ్గించుకోవాలి. దీంతో ఇండియా ఖర్చు చేసే డాలర్లు తగ్గుతాయి.  గ్రీన్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవ్వడం, అవసరమైన చోట కరెంట్‌‌ స్టవ్‌‌లను, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి ఎలక్ట్రిక్ ఆధారిత ప్రొడక్ట్‌‌లను  వినియోగించడం వంటివి చేయాలి. ఇరాన్ యుద్ధం ఆగిపోతే క్రూడాయిల్ ధరలు దిగొచ్చి రూపాయి విలువ పుంజుకునే అవకాశం ఉంది. దీంతో  ఇండియా జీడీపీ తిరిగి  నాల్గో స్థానాన్ని తిరిగి చేరుకోగలుగుతుంది.