తిరుమల భక్తులకు శుభవార్త : తగ్గిన రద్దీ - కారణం ఇదే..

తిరుమల భక్తులకు శుభవార్త : తగ్గిన రద్దీ - కారణం ఇదే..

కలియుగ వైకుంఠం తిరుమలకు ఏడాదికి ఒక్కసారైనా వెళ్లి ఆ తిరుమలేశుని దర్శించుకోవాలని చాలా మంది అనుకుంటుంటారు. అయితే, తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న రద్దీ కారణంగా దర్శనానికి చాలా సమయం కంపార్ట్మెంట్స్ లో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా తర్వాత దర్శన టికెట్లు ఆన్లైన్ లో విక్రయించటం మొదలైన తర్వాత తిరుమల వెళ్లాలంటే కనీసం నెలరోజుల ముందు నుండే ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా చాలా కాలం తర్వాత తిరుమలలో కంపార్ట్మెంట్స్ లో వేచి ఉండకుండా డైరెక్ట్ గా క్యూ లైన్ లో వెళ్లి దర్శనం చేసుకునే అవకాశం వచ్చింది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుండి తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. ఈ కారణంగా ఇప్పుడు కంపార్ట్మెంట్స్ లోకి కాకుండా భక్తులను నేరుగా క్యూలైన్లోకి అనుమతిస్తున్నారు. మంగళవారం స్వామివారిని 63,251 మంది దర్శించుకోగా, 23,107మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4.14 కోట్ల మేర వచ్చింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తిరుమలలో సిఫార్సు లేఖల ద్వారా దర్శనానికి అనుమతి రద్దు చేయటం కూడా రద్దీ తగ్గటానికి కారణమని చెప్పచ్చు.