800 మంది తలదాచుకున్న కెమికల్ ప్లాంటుపై రష్యా దాడి

800 మంది తలదాచుకున్న కెమికల్ ప్లాంటుపై రష్యా దాడి

కీవ్/మాస్కో: ఉక్రెయిన్​లోని మరో సిటీలో మరియుపోల్ స్టీల్ ప్లాంట్ తరహాలో పోరాటం కొనసాగుతోంది. లుహాన్స్క్ ప్రావిన్స్​లోని సెవెరోడోనెట్స్క్ సిటీలో ఉన్న అజోట్ కెమికల్ ప్లాంట్​లో 300 మంది సోల్జర్లు, 500 మంది ప్రజలు దాక్కున్నారు. కెమికల్ ప్లాంట్​పై రష్యన్ బలగాలు ఆర్టిలరీ గన్స్​తో షెల్లింగ్ కొనసాగిస్తుండటంతో ప్లాంట్ నుంచి కెమికల్స్, రేడియేటర్ల నుంచి చమురు లీకయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కెమికల్ ప్లాంట్ నుంచి ఉక్రెయిన్ సోల్జర్లు కూడా ఎదురుకాల్పులు జరుపుతున్నారు. ‘‘అజోట్ ప్లాంటులోని ఫస్ట్ గేట్ హౌస్ వద్ద 300 మంది ఉక్రెయిన్ సోల్జర్లు దాక్కుని, ఆ ప్రాంతాన్ని బ్లాక్ చేశారు. ప్లాంటులోని బాంబ్ షెల్టర్​లో 500 మంది ప్రజలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది” అని లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ అంబాసిడర్ రోడియన్ మిరోష్నిక్ శనివారం ‘టెలిగ్రామ్’ పోస్టులో వెల్లడించారు. ప్లాంటులోని ఉక్రెయిన్ సోల్జర్లు కొంత మంది రష్యన్ సోల్జర్లను పట్టుకున్నారని, తమను లిసిచాన్స్క్‌ సిటీకి సేఫ్​గా పంపించాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఈ డిమాండ్​కు రష్యా అంగీకరించలేదన్నారు. ఉక్రెయిన్ సోల్జర్లు బందీలను వదిలి లొంగిపోతేనే.. విడిచి పెడతామని చెప్పారు. ప్లాంటులోని ప్రజలను తరలించేందుకు చర్చిస్తున్నట్లు తెలిపారు. 

తిండిలేకుండా ఎట్ల కొట్లాడాలె: రష్యా సోల్జర్లు 

డోనెట్స్క్ ప్రావిన్స్​లో రష్యా తరఫున పోరాడుతున్న 113వ రెజిమెంట్ సోల్జర్లు రష్యా అధ్యక్షుడిపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తమను బలవంతంగా సైన్యంలో చేర్చుకున్నారు.. అయితే తిండి, మందులు ఇవ్వకుండా యుద్ధం చేయాలంటే ఎలా అని ప్రశ్నించారు. ఆ రెజిమెంట్ ఆఫీసర్ ఒకరు తన టీమ్​తో కలిసి నేరుగా పుతిన్​ను ప్రశ్నించిన వీడియో ఒకటి బయటకొచ్చింది. జూన్ 1న ఈ వీడియో తీశారని, ఆ మరునాడే ఆ ఆఫీసర్​ను రష్యన్ బలగాలు పట్టుకెళ్లాయని చెప్తున్నారు. అతనిని చంపేసి, శవాన్ని ఆయన తల్లి ఉంటున్న ఇంటిముందు పడేశారని పేర్కొంటున్నారు.

డాన్ బాస్ ధిక్కరిస్తోంది: జెలెన్ స్కీ 

ఎనిమిదేండ్లుగా రష్యా అనుకూల రెబెల్స్ ఆధీనంలో ఉన్న డాన్​బాస్​ ఏరియాలో పోరాటం దీటుగా కొనసాగుతోందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్​ జెలెన్ స్కీ అన్నారు. ‘‘తూర్పు ఉక్రెయిన్​ను ఈజీగా స్వాధీనం చేసుకుంటామని రష్యన్లు అనుకున్నరు. కానీ డాన్​బాస్ పోరాడుతోంది. 108 రోజులైనా రష్యాను ధిక్కరిస్తోంది” అని చెప్పారు.