
జెనీవా: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై క్రీడా ప్రపంచం వార్‌ను ప్రకటించింది. రష్యాలో ఎలాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌ను ఏర్పాటు చేయొద్దని అన్ని క్రీడా సమాఖ్యలను అంతర్జాతీయ ఒలింపి క్ కమిటీ (ఐవోసీ) కోరింది. అలాగే రష్యా, బెలారస్ అథ్లెట్లను, అధికారులను రాబోయే వరల్డ్ ఈవెంట్లలో పాల్గొనకుండా బ్యాన్ చేయాలని పిలుపునిచ్చింది. ‘క్రీడా పోటీల సమగ్రతను కాపాడాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే అన్ని ఈవెంట్ల నుంచి రష్యాను బహిష్కరించండి. ఆ దేశ జెండాను వాడొద్దు. జాతీయ గీతాలను ఆలపించొద్దు’ అని ఐవోసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఓ ప్రకటన చేసింది. మరోవైపు ఈ ఏడాది జరిగే సాకర్ వరల్డ్ కప్ నుంచి రష్యాను తప్పించినట్టు ఫిఫా ప్రకటించింది. తదుపరి నోటీసులు ఇచ్చేదాకా అన్ని ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ ఈవెంట్లలో పాల్గొనకుండా రష్యా జట్లు, క్లబ్స్‌ను సస్పెండ్ చేసింది.