ఉక్రెయిన్​పై 120 క్షిపణులతో విరుచుకుపడిన రష్యా

ఉక్రెయిన్​పై 120 క్షిపణులతో విరుచుకుపడిన రష్యా

కీవ్ :ఉక్రెయిన్​పై రష్యా మిసైల్స్ వర్షం కురిపించింది. గురువారం ఉదయం రాజధాని కీవ్​తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న కీలక నగరాలను టార్గెట్​గా చేసుకుని మిసైల్స్​తో దాడి చేసింది. పవర్ స్టేషన్లు, వాటర్​ సప్లై సెంటర్ల​తో పాటు మౌలిక సదుపాయాలే లక్ష్యంగా క్షిపణులు ప్రయోగించింది. గడిచిన కొన్ని వారాల్లో ఇదే అతిపెద్ద దాడి అని ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​ జెలెన్​స్కీ అడ్వైజర్​ మైఖైలో పోడోల్యాక్ ప్రకటించారు. ఆకాశం, సముద్రం నుంచి మిసైల్స్​ ప్రయోగించారని వివరించారు. కీవ్​లో ఎయిర్​ డిఫెన్స్​ సిస్టమ్​ను యాక్టివేట్​ చేసి కొన్ని మిసైల్స్​ను కూల్చేశామని తెలిపారు. రష్యా దాడిని ముందే తెలుసుకుని దేశ వ్యాప్తంగా సైరన్​లు మోగించి ప్రజలను అలర్ట్​ చేశామని, మరణాలపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. 

అంధకారంలో ల్వీవ్​ నగరం

తూర్పు ఉక్రెయిన్​లోని కొన్ని నగరాల్లో పేలుళ్లు సంభవించాయని పలువురు గవర్నర్లు తెలిపారు. ఖార్కీవ్​తో పాటు పోలండ్ సరిహద్దు నగరమైన ల్వీవ్​పై కూడా మిసైల్స్​ పడ్డాయి. ల్వీవ్​ నగరంలోని 90శాతం ఏరియా చీకట్లో మగ్గుతున్నదని మేయర్ ఆండ్రీ సడోవి తెలిపారు. లోకల్ రైళ్లు, ట్రాలీ బస్సులు పని చేయడం లేదని, వాటర్​ సప్లై లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వివరించారు. ఉక్రెయిన్​ నార్త్​ఈస్ట్​లో రష్యా బార్డర్​లో ఉన్న సుమీని రెండు మిసైల్స్​ తాకినట్టు నార్త్​మిలటరీ కమాండర్​ ప్రకటించారు. 

కీవ్​లో రెండు భవనాలు ధ్వంసం

రాజధాని కీవ్​లోని డార్నిట్స్కీ డిస్ర్టిక్​లో రష్యా మిసైల్స్​ దాడికి 2 ప్రైవేట్​ బిల్డింగ్స్​ ధ్వంసమైనట్టు అధికారులు తెలిపారు. డ్నిప్రో, ఒడెసాతో పాటు క్రివీ రిహ్​ రీజియన్స్​లో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కరెంట్​ సప్లై నిలిపివేసినట్టు తెలిపారు. 54 రష్యన్​ మిసైల్స్​ను కూల్చేసినట్టు ఉక్రెయిన్ కమాండర్ ఇన్- చీఫ్ ప్రకటించారు. ఏ వైపు నుంచి బాంబులు పడతాయోనని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా రష్యా దాడులు కొనసాగుతున్నాయన్నారు. 

రష్యా ప్రయత్నాలను తిప్పికొడ్తున్నం

నగరంలోని కొన్ని చోట్ల పేలుళ్లు శబ్దాలు వినిపించాయని కీవ్‌‌ మేయర్‌‌ విటాలి క్లిట్స్కో తెలిపారు. ముగ్గురు గాయపడగా.. వారిలో 14 ఏండ్ల అమ్మాయి కూడా ఉందన్నారు. విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడొచ్చని, నీటిని కూడా నిల్వ చేసుకోవాలని ముందే సూచించామన్నారు. డోన్‌‌బాస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొడుతున్నామని, కొన్ని రష్యన్ ఎక్స్​ప్లోజివ్​ డ్రోన్లను ఉక్రెయిన్ ఆర్మీ కూల్చేసిందని వివరించారు. చాలా నగరాల్లో ఇంటర్​నెట్​తో పాటు కరెంటు సప్లై నిలిచిపోయిందన్నారు.