
రష్యా(Russia) దళాలు మరోసారి ఉక్రెయిన్(Ukraine)పై క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఒక్క రోజులో పలు నగరాలపై దాదాపు 81క్షిపణులను ప్రయోగించింది. రష్యా ల్వీవ్‌పై చేసిన రాకెట్ దాడిలో ఐదుగురు మరణించారు. మరోవైపు డెనిప్రోపెట్రోవస్క్ పై జరిగిన క్షిపణి దాడిలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.
రష్యా క్షిపణుల దాడులతో జపోరిజియా అణు విద్యుత్తు కేంద్రానికి ఉక్రెయిన్ విద్యుత్తు వ్యవస్థకు మధ్య ఉన్న చివరి సంబంధం తెగిపోయింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని పశ్చిమ, దక్షిణ భాగాలపై రష్యా దాడులు నిర్వహించింది. ఈ దాడిలో చాలా వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు షెల్టర్లలోనే ఉండాలని కీవ్ మేయర్ అభ్యర్థించారు. నగరంలో ప్రతి 10 ఇళ్లలో నాలుగు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
రేవు నగరమైన ఒడెస్సాలో విద్యుత్తు వ్యవస్థలపై భారీగా క్షిపణి దాడులు జరిగాయి. దీంతో చాలా చోట్ల విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక్కడ ఇళ్లపై కూడా క్షిపణులు కూలినట్లు తెలుస్తోంది. ఖర్కీవ్ నగరంపై రష్యా 15 క్షిపణులను ప్రయోగించింది. జనావాసాలు, ఇతర భవనాలు దెబ్బతిన్నాయి.
జనవరి తర్వాత ఉక్రెయిన్‌పై జరిగిన అతిపెద్ద దాడి ఇదే అని చెబుతున్నారు. బక్ముత్ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు కొన్ని నెలలుగా రష్యా సేనలు ఉక్రెయిన్ దళాలతో పోరాడుతున్నాయి. తాజాగా ఈ నగరంలో కొన్ని విజయాలు సాధించి.. ముందడుగు వేశాయి.