రష్యా ల్యాండర్ కూలిపోయింది

రష్యా ల్యాండర్ కూలిపోయింది
  • జాబిల్లి ఉపరితలంపై క్రాష్ ల్యాండ్.. లూనా 25తో 
  • కమ్యూనికేషన్ కట్
  • రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ వెల్లడి
  • ఫెయిల్యూర్ పై ఎంక్వయిరీ చేస్తున్నామని ప్రకటన
  • జాబిల్లి ఉపరితలంపై క్రాష్  ల్యాండ్
  • లూనా 25తో శనివారమే కమ్యూనికేషన్ కట్
  • రష్యా అంతరిక్ష సంస్థ వెల్లడి

మాస్కో: చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా చేపట్టిన లూనా 25 మిషన్ విఫలమైంది. చంద్రుడి ఉపరితలంపై లూనా 25 స్పేస్ క్రాఫ్ట్  కూలిపోయింది. ఈ మేరకు రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. శనివారం స్పేస్ క్రాఫ్ట్​ను  ప్రిల్యాండింగ్​ ఆర్బిట్​లోకి ప్రవేశపెట్టే క్రమంలో ఎమర్జెన్సీ నెలకొందని తెలిపింది. దీంతో కక్ష్య తగ్గించడం సాధ్యం కాలేదని, స్పేస్ క్రాఫ్ట్ కంట్రోల్ తప్పిందని వివరించింది. 

శనివారం మధ్యాహ్నం 2:57 గంటలకు స్పేస్ క్రాఫ్ట్​తో కమ్యూనికేషన్ తెగిపోయిందని సైంటిస్టులు తెలిపారు. లూనా 25 స్పేస్ క్రాఫ్ట్​తో కాంటాక్ట్ అయ్యేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై కూలిపోయిందన్నారు. ‘‘క్రాష్ ల్యాండింగ్​కు కారణాలు తెలీదు. టెక్నికల్ ఫెయిల్యూరే కారణం కావొచ్చు. ఎంక్వయిరీ చేస్తున్నం” అని రోస్ కాస్మోస్ పేర్కొంది. 

47 ఏళ్ల తర్వాత చేపట్టిన మిషన్  విఫలం

చందమామపై పరిశోధనల కోసం రోస్ కాస్మోస్  47 ఏళ్ల తర్వాత లూనా 25 మిషన్  చేపట్టింది. లూనా 25 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై సోమవారం దిగాల్సి ఉంది. కానీ, చివరి క్షణంలో కంట్రోల్ తప్పి చంద్రుడి ఉపరితలంపై కూలిపోయింది. ఇప్పటి వరకూ సోవియట్ యూనియన్, అమెరికా, చైనా మాత్రమే చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టాయి. అయితే, దక్షిణ ధ్రువం మీద ఇప్పటి వరకూ ఏ దేశం కూడా అడుగుపెట్టలేదు.

ముందే చెప్పిన రోస్​కాస్మోస్  బాస్

లూనా 25 స్పేస్ క్రాఫ్ట్ విజయవంతం కాకపోవచ్చని రోస్​కాస్మోస్ చీఫ్ యురీ బోరిసోవ్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్  పుతిన్​కు ముందే చెప్పారు. ‘‘హడావుడిగా ప్రయోగంచేస్తే మిషన్  సక్సెస్  కాదు. విజయవంతమయ్యే అవకాశం 70% మాత్రమే. ఈ పరిస్థితుల్లో మిషన్ చేపట్టడం రిస్కే” అని బోరిసోవ్  జూన్​లోనే స్పష్టం చేశారు.