మాస్కో: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్‌పై రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఉగ్ర వాదానికి సహకరిస్తున్నారనే తీవ్రమైన అభియోగాలను మోపుతూ రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ఆయన్ను అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, వివిధ ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలు రష్యా వ్యతిరేక విధ్వంసక చర్యలకు టెలిగ్రామ్‌లోని కొన్ని చానెళ్లు, చాట్‌బాట్లను విస్తృతం గా ఉపయోగిస్తున్నాయని రష్యా భద్రతా సంస్థ ఆరోపించింది.
అటువంటి వాటిని అణిచివేయడంలో టెలిగ్రామ్ యాజమాన్యం పూర్తిగా విఫలమైందని పేర్కొంది. టెలిగ్రామ్‌లోని ఒక డేటింగ్ చాట్‌బాట్‌ను ఉపయోగించి ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ రష్యన్ పౌరులను, ముఖ్యంగా యువతను విధ్వంసక కార్యకలాపాల కోసం ఆకర్షిస్తున్నాయని రష్యా తెలిపింది. అయితే, రష్యా తనపై కక్షగట్టి తప్పుడు కేసులు బనాయి స్తోందని పావెల్ దురోవ్ ఆరోపిస్తున్నారు. వ్యక్తిగత గోప్యతను, భావప్రకటన స్వేచ్ఛను అణచివేయడానికే రష్యా ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తోందన్నారు.
కాగా, గతంలో ఫ్రాన్స్ కూడా పావెల్ దురోవ్‌ను అరెస్ట్ చేసి, టెలిగ్రామ్ వేదికగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, నేరాలను నియంత్రించడంలో విఫలమయ్యారనే ఆరోపణలపై విచారణ చేపట్టింది. అయితే, ప్రస్తుతం ఇంటర్నెట్‌పై పూర్తి పట్టు సాధించేందుకు రష్యా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే టెలిగ్రామ్‌పై ఈ ఉక్కుపాదం మోపినట్లు నిపుణులు విశ్లే షిస్తున్నారు. పావెల్‌పై నేరం రుజువు అయితే తీవ్రమైన శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు.
