పుతిన్​ కాళ్లు వణికినయ్​

పుతిన్​ కాళ్లు వణికినయ్​

కీవ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్  తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నారంటూ కొన్ని రోజులుగా చాలా కథనాలు వస్తున్నాయి. జబ్బు విషయం బయటపడుతుందని.. ఆయన మలాన్నీ మూటగట్టి స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా బాడీగార్డులనూ పెట్టుకున్నారన్న వార్తలూ వచ్చాయి. అయితే, ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చే ఓ వీడియో బయటకు వచ్చింది. క్రెమ్లిన్​లో పోయిన ఆదివారం జరిగిన ఓ అవార్డుల వేడుకకు పుతిన్​ హాజరయ్యారు. ఆ కార్యక్రమం సందర్భంగా పుతిన్​ మాట్లాడారు. అయితే, ఆయన నిలబడి మాట్లాడుతున్నంత సేపూ కాళ్లు వణుకుతూనే ఉన్నాయి. నిలబడేందుకూ ఓపిక లేదన్నట్టుగా ఆయన నీరసంగా కనిపించారు. ఆ వీడియో కాస్తా సోషల్​ మీడియాలో చక్కర్లు కొట్టడంతో తెగ వైరల్​ అయిపోయింది. నిజంగానే పుతిన్​కు జబ్బున్నట్టుందన్న కామెంట్లు వినిపించాయి. పుతిన్​ పర్సనల్​ డాక్టర్లు మాత్రం.. ఎక్కువ సేపు బయటకు వెళ్లొద్దని ఆయనకు చెప్పినట్టు తెలుస్తోంది. 

పేలుతున్న మందుపాతరలు..

ఉక్రెయిన్​లోని చాలా చోట్ల యుద్ధం దాదాపు ముగిసిపోయింది. అయినా, జనాల ప్రాణాలు గాల్లో కలసిపోతూనే ఉన్నాయి. కూలిన ఇండ్లను మళ్లీ కట్టుకునే పనులకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. కారణం, మందు పాతరలు. అక్కడి గ్రామీణ ప్రాంతాల్లో మందుపాతరలకు రైతులు, ఇతర కూలీలే బలైపోతున్నారు. వాస్తవానికి దేశ తూర్పు ప్రాంతంలో వేర్పాటువాదులు అక్కడ మందుపాతరలను పెట్టారు. రష్యా ఆక్రమణకన్నా ముందునుంచే దాదాపు 3 లక్షల చదరపు కిలోమీటర్ల మేర మందుపాతరలున్నట్టు ఉక్రెయిన్​ ఎమర్జెన్సీ సర్వీస్​ చెప్తోంది. వాటిని గుర్తించి,  నిర్వీర్యం చేసేందుకు ‘డీమైనింగ్​ ఉక్రెయిన్​’ అనే యాప్​ను అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చింది. మైన్లు కనిపించినట్లనిపిస్తే ఈ యాప్​లో ఫొటోలు, వీడియోలు, జియోలొకేషన్​తో సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించింది.