ఆంక్షలు ఉన్నా జోరుగానే ఆయిల్ బిజినెస్

ఆంక్షలు ఉన్నా జోరుగానే ఆయిల్ బిజినెస్
  • యూరప్ దేశాలకే 61శాతం ఎగుమతులు
  • ఫిన్లాండ్ కు చెందిన ‘క్రియా’ సంస్థ రిపోర్ట్

హెల్సింకి (ఫిన్లాండ్): ఉక్రెయిన్​పై దండయాత్రకు దిగిన రష్యాకు ముకుతా డు వేసేందుకని అమెరికా, యూరప్ దేశాలు ఆంక్ష లు విధించినా.. రష్యా ఆయిల్ బిజినెస్ మాత్రం మరింత జోరుగా సాగింది. యుద్ధం మొదలైన తొలి 100 రోజుల్లో రష్యా ఏకంగా 9,800 కోట్ల డాలర్ల (రూ.7.65 లక్షల కోట్లు) ఆయిల్ బిజినెస్ చేసిందని ఫిన్లాండ్​కు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్(క్రియా) సంస్థ వెల్లడించింది. రష్యాపై అమెరికా పెట్టిన ఆంక్షలకు మద్దతు తెలిపిన యూరప్ దేశాలు రష్యా నుంచి భారీగానే చమురును, నేచురల్ గ్యాస్​ను దిగుమతి చేసుకున్నాయని తెలిపింది. అన్ని దేశాలకు కలిపి వంద రోజుల్లో రూ.7.65 లక్షల కోట్ల విలువైన చమురు, నేచురల్ గ్యాస్​ను రష్యా సప్లై చేయగా.. ఇందులో 61% (రూ. 4.68 లక్షల కోట్ల ఇంధనం) దిగుమతులు యూరప్ దేశాలే చేసుకున్నాయని క్రియా పేర్కొంది.  
యుద్ధం వల్ల 60% పెరిగిన ధరలు 
ఆంక్షల కారణంగా రష్యా ఆయిల్ బిజినెస్ పై తీవ్ర ఎఫెక్ట్ పడుతుందని అందరూ భావించారు. కానీ యుద్ధంవల్ల రష్యన్ ఆయిల్ ఎక్స్ పోర్ట్ ధరలు నిరుటి కన్నా ఏకంగా 60% పెరిగాయి. చమురు, గ్యాస్ కోసం రష్యాపైనే ఆధారపడక తప్పని పరిస్థితి ఉండటంతో యూరప్ దేశాలు కూడా తమ దిగుమతులను కొనసాగించాయి. ఇండియా, చైనా, యూఏఈ వంటి దేశాలకు రష్యా భారీగా రాయితీలు ప్రకటించడంతో.. ఆయా దేశాలు మునుపటి కన్నా ఎక్కువగా చమురు కొనుగోళ్లు చేశాయి. అత్యధికంగా ఆయిల్ ఇంపోర్ట్​ చైనా చేసుకోగా.. ఆ తర్వాతి స్థానాల్లో జర్మనీ, ఇటలీ ఉన్నాయి. ఇక ఫ్రాన్స్ అయితే ఏకంగా ప్రపంచంలోనే అత్యధికంగా ఎల్ఎన్జీని దిగుమతి చేసుకుంది. దీంతో యుద్ధం, ఆంక్షలు కొనసాగినా రష్యా ఇంధన వ్యాపారం మాత్రం జోరుగానే సాగిందని క్రియా సంస్థ తన నివేదికలో పేర్కొంది.