ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌పై రష్యా సంచలన ఆరోపణలు

ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌పై రష్యా సంచలన ఆరోపణలు

తమ అధ్యక్షుడు పుతిన్‌‌ను హత్య చేసేందుకు ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్‌‌స్కీ కుట్ర చేశారని రష్యా సంచలన ఆరోపణలు చేసింది. మాస్కోలో అధ్యక్ష భవనంపై బుధవారం డ్రోన్లతో దాడి చేసేందుకు యత్నించగా కూల్చేసినట్టు వెల్లడించింది.

మాస్కో: ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌పై రష్యా సంచలన ఆరోపణలు చేసింది. తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌‌‌‌‌‌‌‌ను హత్య చేసేందుకు ఉక్కెయిన్​ ప్రెసిడెంట్​ జెలెన్‌‌‌‌‌‌‌‌స్కీ కుట్ర చేశారని తెలిపింది. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు మాస్కోలో అధ్యక్ష భవనంపై (క్రెమ్లిన్) పై ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌కు చెందిన రెండు మానవ రహిత డ్రోన్లు దాడి చేసేందుకు యత్నించగా.. రాడార్ వ్యవస్థతో గుర్తించి తమ సైన్యం కూల్చేసిందని వెల్లడించింది. దీన్ని ఒక ఉగ్రవాద చర్యగా రష్యా అభివర్ణించింది. విక్టరీ డే సందర్భంగా విదేశీ ప్రతినిధులతో మే 9న తాము నిర్వహించబోయే  పరేడ్‌‌‌‌‌‌‌‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి ఉక్రెయిన్ కుట్ర చేసిందని పేర్కొంది.

 ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌ డ్రోన్ల దాడిలో పుతిన్‌‌‌‌‌‌‌‌కు ఎలాంటి హాని జరగలేదని.. ఆ టైంలో ఆయన క్రెమ్లిన్‌‌‌‌‌‌‌‌లో లేరని, నోవో ఒగర్యోవో నివాసం నుంచి పనిచేస్తున్నారని క్రెమ్లిన్‌‌‌‌‌‌‌‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. అధ్యక్ష భవనాలు కూడా దెబ్బతినలేదన్నారు. డ్రోన్ దాడికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. సరైన సమయంలో దీటుగా స్పందిస్తామని కామెంట్ చేశారు. డ్రోన్ల దాడి కలవరం సృష్టించినప్పటికీ మే 9న మాస్కోలో విక్టరీ డే పరేడ్‌‌‌‌‌‌‌‌ యథావిధిగా జరుగుతుందన్నారు. ఈ దాడి నేపథ్యంలో మాస్కోలో డ్రోన్ల వినియోగంపై బ్యాన్ విధిస్తున్నట్లు నగర మేయర్‌‌‌‌‌‌‌‌ సెర్గీ సోబ్యానిన్  ప్రకటించారు. డ్రోన్ల దాడి ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  డ్రోన్లను రష్యా ఆర్మీ కూల్చేసిన తర్వాత క్రెమ్లిన్ ప్యాలెస్ వెనుక పొగలు పైకి లేస్తున్న దృశ్యాలు ఆ వీడియోల్లో కనిపించాయి. అధ్యక్ష భవనం గోపురం మీదుగా వెళ్తున్న డ్రోన్‌‌‌‌‌‌‌‌లలో ఒకదాన్ని రష్యా ఆర్మీ కూల్చేయడం ఇంకో వీడియోలో కనిపించింది. 2.7 కోట్ల మంది సోవియట్ యూనియన్ దళాలు జీవితాలను పణంగా పెట్టి  హిట్లర్ నాజీలను ఓడించిన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రష్యా రాజధాని మాస్కోలో  ఏటా  మే 9 విక్టరీ డే పరేడ్ నిర్వహిస్తుంటారు. 

చేయబోయే దాడుల  సమర్థనకే..రష్యా ఆరోపణలపై ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌ ఫైర్​

రష్యా అధ్యక్ష భవనంపై జరిగిన డ్రోన్ల దాడి ఘటనపై ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌ స్పందించింది. దానితో తమకు సంబంధం లేదని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం స్పష్టం చేసింది. అలా చేయడం వల్ల  ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌కు ఎటువంటి ప్రయోజనం లేదని.. రష్యా మరింతగా దాడులు చేసేందుకు ఇలాంటి చర్యలు దారితీస్తాయని తెలిపింది. రాబోయే రోజుల్లో చేయనున్న మరిన్ని దాడులను  సమర్థించుకోవడానికే రష్యా తమపై ఇటువంటి ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. ఈ పరిణామాలను చూస్తుంటే ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌పై భారీ స్థాయిలో దాడి చేసేందుకు రష్యా సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోందని జెలెన్‌‌‌‌‌‌‌‌స్కీ సలహాదారు మైకిలో పొదొల్యాక్‌‌‌‌‌‌‌‌ అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు జెలెన్‌‌‌‌‌‌‌‌స్కీ ప్రస్తుతం ఫిన్లాండ్‌‌‌‌‌‌‌‌ పర్యటనలో ఉన్నారు.ఇక పుతిన్‌‌‌‌‌‌‌‌ను హత్య చేసేందుకు జెలెన్‌‌‌‌‌‌‌‌స్కీ కుట్ర చేశారనే రష్యా ఆరోపణలపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నామని అమెరికా ఇంటెలిజెన్స్ అధికార వర్గాలు వెల్లడించాయి. “నేను రష్యా  ఆరోపణలను ఏ విధంగానూ ధ్రువీకరించలేను. వాస్తవాలు ఏమిటో తెలియకుండా దీనిపై వ్యాఖ్యానించడం లేదా ఊహించడం చాలా కష్టం” అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పేర్కొన్నారు.

పుతిన్ పై ఇప్పటిదాకా హత్యాయత్నాలు..

2022 ఫిబ్రవరి 24న తమ దేశంపై రష్యా దాడిచేసిన నేపథ్యంలో పుతిన్​ హత్యకు కుట్రపన్నామని ఉక్రెయిన్  డిఫెన్స్  ఇంటెలిజెన్స్  చీఫ్​ మేజర్  జనరల్  కైరిలో బుడనోవ్  తెలిపారు. ఫిబ్రవరి 24న దాడి జరిగిన కొద్ది సేపట్లోనే బ్లాక్ సీ, కాస్పియన్  సీ మధ్య ఉన్న కాకసస్​లో పుతిన్  చంపాలనుకొన్నామని బుడనోవ్  చెప్పారు.
2012లో రష్యా అధ్యక్ష ఎన్నికల సమయంలో పుతిన్ ను చంపేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించగా రష్యా, ఉక్రెయిన్  సెక్యూరిటీ సర్వీసెస్  వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు.

  • 2003 అక్టోబర్​లో పుతిన్  రష్యాలో పర్యటిస్తుండగా.. ఆయనను చంపేందుకు కొంతమంది దుండగులు పన్నిన కుట్రను బ్రిటిష్  యాంటీటెర్రర్  పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. వారిలో ఒకడు రష్యన్  సీక్రెట్  సర్వీస్ కు చెందిన వ్యక్తి.
  • 2002 లో అజర్ బైజాన్​లో పుతిన్  పర్యటిస్తుండగా.. ఇరాక్​కు చెందిన వ్యక్తి ఆయనను హత్య చేయడానికి కుట్రపన్నాడు. తర్వాత అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో అతనికి పదేళ్ల జైలుశిక్ష పడింది.
  • 2003లో పుతిన్  కారుపై దాడిచేసేందుకు కుట్రపన్నారని రష్యా అధికారులకు ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చింది. దీంతో తనిఖీలు చేసిన అధికారులు.. రోడ్డుపై 40 కిలోల పేలుడు పదార్థాల ను స్వాధీనం చేసుకున్నారు.తాజా గా ఉక్రెయిన్  తమ ప్రెసిడెంట్ ను చంపేందుకు ప్రయోగించిన 2 డ్రోన్లను కూల్చేశామని రష్యా పేర్కొంది.