రష్యాలో భారీ అగ్ని ప్రమాదం..15 మంది మృతి

రష్యాలో భారీ అగ్ని ప్రమాదం..15 మంది మృతి

మాస్కో: రష్యాలోని కోస్ట్రోమా సిటీలో ఉన్న పోలిగాన్ కేఫ్‌‌లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. గాయపడినవారిని ట్రీట్మెంట్ కోసం వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

అగ్ని ప్రమాదం జ‌‌రిగిన బిల్డింగ్ నుంచి 250 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడినట్లు వివరించారు. మంటలు ఎక్కువగా వ్యాపించడంతో  కేఫ్ పైకప్పు కూలిపోయిందని తెలిపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది సుమారు ఐదు గంటల పాటు శ్రమించినట్లు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగా బిల్డింగ్ పక్కనున్న ఇండ్లలోని ప్రజలను ఖాళీ చేయించామని చెప్పారు.

కేఫ్-లో ఓ వ్యక్తి ఫ్లేర్ గన్-ను పేల్చడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మంటలు చెలరేగడానికి ముందు కేఫ్-లో ఘర్షణ జరిగినట్లు తెలిపారు. ఫ్లేర్ గన్ పేల్చిన వ్యక్తిని అరెస్టు చేశామని.. దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని కేఫ్ ఓనర్  హామీ ఇచ్చారు.

రష్యా రాజధాని మాస్కోకు ఈశాన్యంగా 340 కిలోమీటర్ల దూరంలో కోస్ట్రోమా నగరం ఉంది. రష్యాలో జరిగిన భారీ అగ్నిప్రమాదాల్లో ఇది రెండవది. 2009లో పెర్మ్ సిటీలోని లేమ్ హార్స్ నైట్‌‌క్లబ్‌‌లో ఎవరో బాణాసంచా పేల్చడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మంటల్లో  చిక్కుకుని150 మందికి పైగా మరణించారు.