పిజ్జా రెస్టారెంట్​పై రష్యా మిసైల్ దాడి

పిజ్జా రెస్టారెంట్​పై రష్యా మిసైల్ దాడి
  • క్రమాటోర్స్క్ సిటీలో ఘటన
  • 11 మంది మృతి.. మరో 70 మందికి గాయాలు
  • పోలీసుల అదుపులో దాడికి సహకరించిన వ్యక్తి

కీవ్: ఈస్ట్ ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌లోని క్రమాటోర్స్క్ నగరంపై రష్యా మిసైల్స్​తో దాడి చేసింది. ప్రముఖ రెస్టారెంట్​ను లక్ష్యంగా చేసుకుని 2 క్షిపణులను ప్రయోగించింది. ఈ అటాక్​లో 11 మంది చనిపోయారు. 70‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ దాడి పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్టు ఉక్రెయిన్ నేషనల్ పోలీసులు తేల్చారు. ఉక్రెయిన్​కు చెందిన వ్యక్తే రష్యాకు హెల్ప్ చేసినట్లు గుర్తించి, అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. 

శిథిలాల కింద మరికొంత మంది

ఒక మిసైల్ పిజ్జా రెస్టారెంట్​ను, రెండో క్షిపణి క్రమాటోర్స్క్ సిటీ శివార్లలోని గ్రామాన్ని ఢీకొట్టింది. క్రమాటోర్స్క్ దాడిలో 18 అంతస్తుల బిల్డింగ్స్, 65 ఇండ్లు, 5 స్కూల్స్, 2 కిండర్ గార్డెన్స్, ఒక షాపింగ్ సెంటర్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, రిక్రియేషనల్ భవనం ధ్వంసమైనట్లు రీజినల్ గవర్నర్ పావ్లో కైరిలెంకో తెలిపారు. రెస్క్యూ కొనసాగుతున్నదని, శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నామన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వివరించారు. కాగా, రెస్టారెంట్​కు తరుచూ జర్నలిస్ట్​లు, ఉక్రెయిన్ సైనికులు, స్థానికులు, లేబర్స్ పెద్ద సంఖ్యలో వస్తూ పోతుంటారు. వీరందరినీ లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ పోలీసులు చెప్పారు.

అమాయకుల ప్రాణాలు తీస్తున్నది : జెలెన్ స్కీ

రెస్టారెంట్​పై దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ తీవ్రంగా ఖండించారు. రష్యా అమాయకుల ప్రాణాలు తీస్తోందని మండిపడ్డారు. సాధారణ ప్రజలను టార్గెట్ చేస్తుందన్నారు. యుద్ధంలో ఎంతోమంది సివిలియన్స్ చనిపోయారని వివరించారు. కాగా, రెస్టారెంట్​పై దాడికి సంబంధించి రష్యాకు సహకరించిన వ్యక్తిని లోకల్ ఉద్యోగిగా గుర్తించారు. రెస్టారెంట్ పాపులారిటీ, ఎవరెవరు వస్తూ పోతుంటారనే దానిపై అనుమానితుడు ఫొటోలు తీసి రష్యాకు పంపినట్లు సెక్యురిటీ సర్వీస్ అధికారులు తేల్చారు.