ఉక్రెయిన్ భూభాగంపైకి రష్యా ప్రెసిడెంట్​

ఉక్రెయిన్ భూభాగంపైకి రష్యా ప్రెసిడెంట్​

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ గడ్డపై కాలుమోపారు. ఉక్రెయిన్ పై ఏడాది కిందట యుద్ధం ప్రారంభించిన తర్వాత తొలిసారిగా ఆయన శనివారం తూర్పు ఉక్రెయిన్ లోని మరియుపోల్ సిటీలో పర్యటించారు. శనివారం హెలికాప్టర్ ద్వారా క్రీమియాకు చేరుకున్న పుతిన్.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మరియుపోల్ కు చేరుకున్నారని రష్యన్ ప్రభుత్వ వార్తా సంస్థ రొస్సియా 24 చానెల్ ఆదివారం వెల్లడించింది. మరియుపోల్ సిటీలో ప్రజలతో, రష్యన్ అధికారులతో పుతిన్ మాట్లాడుతున్న వీడియోలను ప్రసారం చేసింది.

మరియుపోల్ లో కమాండ్ పోస్ట్ పునర్నిర్మాణాన్ని పరిశీలించేందుకే ఆయన వచ్చారని తెలిపింది. 2014 నాటి యుద్ధంలో ఉక్రెయిన్ దక్షిణాది ప్రాంతమైన క్రీమియాను రష్యా స్వాధీనం చేసుకుంది. క్రీమియా స్వాధీనానికి 9 ఏండ్లు పూర్తయిన సందర్భంగా పుతిన్ ఈ పర్యటన చేపట్టినట్లు రష్యన్ చానెల్ పేర్కొంది. ఇక మరియుపోల్ తో పాటు ఉక్రెయిన్ కు చెందిన డోనెట్స్స్, లుహాన్స్క్ ప్రాంతాలను  గత సెప్టెంబర్ లో రెఫరెండం ద్వారా రష్యాలో విలీనం చేసుకున్నట్లు పుతిన్ ప్రకటించారు. ఆ తర్వాత ఇప్పుడు మరియుపోల్ లో రీకన్ స్ట్రక్షన్ పనులను పరిశీలించారు.