
- వెకిచ్, జాస్మిన్ తొలిసారి
లండన్ : వరల్డ్ నంబర్ వన్, టాప్ సీడ్ జానిక్ సినర్‌కు షాకిచ్చిన రష్యా స్టార్ డానిల్ మెద్వెదెవ్ వింబుల్డన్‌లో సెమీఫైనల్ చేరుకున్నాడు. స్పెయిన్ యంగ్‌స్టర్ కార్లోస్ అల్కరాజ్ కూడా ముందంజ వేయగా.. విమెన్స్ సింగిల్స్‌లో డొనా వెకిచ్, జాస్మిన్ పౌలిని తొలిసారి గ్రాండ్ స్లామ్ సెమీస్‌లో అడుగు పెట్టారు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ మెద్వెదెవ్ 6–7 (7/9), 6–4, 7–6 (7/4), 2–6, 6–3తో సినర్(ఇటలీ)పై ఐదు సెట్ల పాటు పోరాడి గెలిచాడు. దాంతో ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో సినర్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు.
సినర్ చేతిలో వరుసగా ఐదు ఓటముల తర్వాత మెద్వెదెవ్‌కు ఇదే తొలి విజయం. 4 గంటల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో నెట్ గేమ్‌లో పైచేయి సాధించిన డానిల్ మూడు బ్రేక్ పాయింట్లను సద్వినియోగం చేసుకున్నాడు. 15 ఏస్‌లు కొట్టిన అతను 56 విన్నర్లు, 27 నెట్ పాయింట్లు సాధించాడు. 11 డబుల్ ఫాల్ట్స్, 49 అనవసర తప్పిదాలు చేసినా కీలక బ్రేక్స్ సాధించి సెమీస్‌లో అడుగు పెట్టాడు. ఈ పోరులో సినర్ అనారోగ్యంతో ఇబ్బంది పడ్డాడు. మూడో సెట్‌లో 11 నిమిషాల టైమ్ ఔట్ తీసుకొని చికిత్స పొందిన అతను రిథమ్ కోల్పోయాడు.
మరో మ్యాచ్‌లో మూడో సీడ్ కార్లోస్ అల్కరాజ్ 5–7, 6–4, 6–2, 6–2తో 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా)పై విజయం సాధించాడు. మరోవైపు విమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో వెకిచ్ (క్రొయేషియా) 5–7, 6–4, 6–1తో లులు సున్ (న్యూజిలాండ్)పై గెలిచింది. 43 గ్రాండ్‌స్లామ్స్ పోటీ పడ్డ వెకిచ్ సెమీస్ చేరడం ఇదే తొలిసారి. మరో మ్యాచ్‌లో జాస్మిన్ (ఇటలీ) 6–2, 6–1తో నవరో (అమెరికా)ను ఓడించి తొలిసారి సెమీస్‌కు వచ్చింది.
మీరు నన్ను టచ్ చేయలేరు : నొవాక్
వింబుల్డన్‌లో ఎనిమిదో టైటిల్‌కు సెర్బియా లెజెండ్ నొవాక్ జొకోవిచ్ మరింత చేరువయ్యాడు. సోమవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–2తో 15వ సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్)ను చిత్తు చేశాడు. ఈ మ్యాచ్ సందర్భంగా సెంటర్ కోర్టులోని పలువురు ఫ్యాన్స్ రూనెకు సపోర్ట్ ఇస్తూ నొవాక్‌ను హేళన చేశారు. అలాంటి ఫ్యాన్స్ తనను టచ్ కూడా చేయలేరని మ్యాచ్ ముగిసిన తర్వాత నొవాక్ తనదైన స్టయిల్లో స్పందించాడు.