ఉక్రెయిన్ సంక్షోభానికి బాధ్యత పశ్చిమ దేశాలదే

ఉక్రెయిన్ సంక్షోభానికి బాధ్యత పశ్చిమ దేశాలదే

మాస్కో: ఉక్రెయిన్​లో సంక్షోభానికి అమెరికా నేతృత్వంలోని వెస్ట్రన్ కంట్రీస్ దే బాధ్యత అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ‘‘ఉక్రెయిన్ లో సంక్షోభాన్ని క్రియేట్ చేయడం, దాన్ని పెంచడం, వేలాది మంది ప్రాణాలు పోవడానికి కారణం పశ్చిమ దేశాలే. లోకల్ సంక్షోభాన్ని గ్లోబల్ సంక్షోభంగా మార్చాలని ఆ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మేం సరైన మార్గంలో ప్రతిస్పందిస్తాం. మేం మా దేశ ఉనికిని కాపాడుకోవడం గురించి మాట్లాడుతున్నాం” అని ఆయన అన్నారు. రష్యా ఎంచుకున్న లక్ష్యాలను జాగ్రత్తగా, సిస్టమెటిక్ గా స్టెప్ బై స్టెప్ సాధించుకుంటామని ప్రకటించారు. రష్యా స్థితిగతుల గురించి వివరిస్తూ పుతిన్ మంగళవారం పార్లమెంట్ ఉభయసభల సభ్యులు, మిలిటరీ కమాండర్స్, సోల్జర్లను ఉద్దేశించి ‘స్టేట్ ఆఫ్​ది నేషన్’ వార్షిక ప్రసంగం చేశారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఉక్రెయిన్ లో సోమవారం సీక్రెట్ గా పర్యటించడం, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించి శుక్రవారం నాటికి ఏడాది కానుండటంతో పుతిన్ వెస్ట్రన్ కంట్రీస్ తీరుపై విరుచుకుపడ్డారు. రష్యా మనుగడ కోసమే ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్నామని సమర్థించుకున్నారు. ప్రపంచ వ్యవహారాల్లో అపరిమిత అధికారాలను పొందాలని అమెరికా, దాని మిత్ర దేశాలు కోరుకుంటున్నాయని మండిపడ్డారు. ఆంక్షల ద్వారా రష్యా ఎకానమీని పతనం చేయాలని పశ్చిమ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.   

‘న్యూ స్టార్ట్’ ఒప్పందం రద్దు.. 

అమెరికాతో అణ్వాయుధాలకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ‘న్యూ స్టార్ట్’ ఒప్పందంలో తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంటున్నామని కూడా పుతిన్ ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య న్యూక్లియర్ వెపన్స్ కంట్రోల్ ఒప్పందాల్లో చివరిదైన ఈ ఒప్పందం కూడా ముగిసినట్లయింది. న్యూ స్టార్ట్ ఒప్పందంపై 2010లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్​ ఒబామా, రష్యా అధ్యక్షుడు మెద్వదెవ్ సంతకాలు చేశారు. ఒప్పందం గడువు 2021లో ముగియగా, ఇరు దేశాలు మరో ఐదేండ్లు పొడిగించుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం.. 1,550కి మించి న్యూక్లియర్ వార్ హెడ్లు, 700కు మించి మిసైల్స్, బాంబర్లను మోహరించరాదని అమెరికా, రష్యా అంగీకరించాయి. ఏటా రెండు దేశాల్లో ఆన్ సైట్ ఇన్ స్పెక్షన్స్ కు కూడా ఒప్పుకున్నాయి. అయితే, కరోనా విపత్తు మొదలైన తర్వాత ఇన్ స్పెక్షన్స్ ఆగిపోయాయి. వీటిని తిరిగి ప్రారంభించేందుకు రష్యా అంగీకరించకపోవడంతో ఈ ఒప్పందం భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.    

రష్యా పవర్ తగ్గుతోంది.. 

ఉక్రెయిన్​పై యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా, దాని మిత్రదేశాలు అమలుచేస్తున్న ఆంక్షలతో రష్యా మిలిటరీ పవర్ తగ్గుతోందని అమెరికా ట్రెజరీ డిపార్ట్​మెంట్ డిప్యూటీ సెక్రటరీ వాలీ అడెయెమో అన్నారు. ఈ యుద్ధంలో రష్యాకు చెందిన దాదాపు 9 వేల మిలిటరీ ఎక్విప్ మెంట్లు నాశనం అయ్యాయని,  50%  ట్యాంకులను కోల్పోయింద న్నారు. అమెరికా, ఈయూ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి 30కి పైగా దేశాలు పెట్టిన ఆంక్షల కారణంగా వాటిని రష్యా రీప్లేస్ చేసుకునేందుకు వీల్లేకుండా పోయిందన్నారు. రష్యన్ ఆయిల్, డీజిల్ ధరలపై క్యాప్స్ విధించడం, ఎక్స్ పోర్ట్​లపై ఆంక్షలు, ఫండ్స్ ను ఫ్రీజ్ చేయడంతో రష్యా ఎకానమీ పతనమైందన్నారు.