- రైతు బంధు ఈ నెల 28 నుంచి
- ఎకరా రైతు నుంచి మొదలు.. రూ.7,645.55 కోట్లు
హైదరాబాద్, వెలుగు : వానాకాలం రైతుబంధు డబ్బులను ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నుంచి సీఎస్ సోమేశ్ కుమార్‌కు బుధవారం ఆదేశాలు అందాయి. ఎప్పటిలాగే ఎకరా నుంచి మొదలు పెట్టి రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను జమ చేయనున్నారు. ఈ వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కోటీ 52 లక్షల 91 వేల ఎకరాలకుపైగా ఉన్న భూములకు సంబంధించి 66.61 లక్షల మందికి రైతుబంధు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సి ఉంది. ఈ సీజన్ పెట్టుబడి సాయం కోసం రూ.7,645.55 కోట్లు అవసరం కానున్నాయి. పోయిన వానాకాలంలో జూన్ 15 నుంచే నిధులు విడుదల చేశారు. ఈ సారి నిధుల లేమితో నిరుడు కంటే 13 రోజులు లేట్‌గా ఇస్తున్నారు. ప్రభుత్వ ఖజానాలో ప్రస్తుత అవసరాలకు సిద్ధంగా ఉన్న రూ.2 వేల కోట్ల నిధులతో రైతు బంధు డబ్బులు జమ చేయడం ప్రారంభిస్తున్నారు.
కేంద్రం తీరు వల్లే ఆలస్యం: నిరంజన్ రెడ్డి
రైతులెవరూ ఆందోళన చెందొద్దని, రాజకీయ కారణాలతో నిధులు అందక కాస్త ఆలస్యమైందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అప్పుల విషయంలో కేంద్రం కావాలనే ఇబ్బంది పెడుతోందన్నారు. తామే నిధులు సమకూర్చుకుని రైతుల ఖాతాల్లో జమచేస్తామని చెప్పారు. ఈసారి రైతులు పత్తి పంట ఎక్కువగా వేయాలని మంత్రి సూచించారు.
