పెట్టుబడికి రైతన్న తిప్పలు

పెట్టుబడికి రైతన్న తిప్పలు
  • రైతుబంధు రాలే.. వడ్ల పైసలు పడలే
  • డబ్బుల కోసం ప్రతి రోజూ ఎదురుచూపులే
  • ఇప్పటికే మొదలైన వానాకాలం సీజన్
  • అదును దాటితే నష్టపోయే అవకాశం
  • బయట అధిక వడ్డీకి అప్పులు తెస్తున్న అన్నదాతలు

జనగామ, వెలుగు:వానాకాలం సీజన్ పై ఆశలు పెంచుకున్న రైతులకు ఆదిలోనే కష్టాలు ఎదురవుతున్నాయి. పెట్టుబడి కోసం గోసపడక తప్పడం లేదు. సర్కారు అస్పష్ట నిర్ణయాలతో గత యాసంగిలో రైతులు నష్టాలను చవి చూశారు. ఈ వానాకాలం సాగుపై భారీగా ఆశలు పెంచుకున్నారు. ప్రభుత్వం రైతు బంధును సకాలంలో అందిస్తామని చెప్పినా.. ఆచరణలోకి తేవడం లేదు. దీనికితోడు కాయకష్టం చేసి వడ్లు అమ్ముకున్న రైతులకు డబ్బులు పడడం లేదు. మరోవైపు వానాకాలం పనులు మొదలవడంతో రైతులు రుణాల వేటలో పడ్డారు. వడ్డీ వ్యాపారుల వైపు చూస్తున్నారు.

అప్పుల కోసం కోటి తిప్పలు..
మృగశిర మొదలుకావడంతో చాలాచోట్ల వానాకాలం పనులు మొదలయ్యాయి. అటు వడ్ల పైసలు, ఇటు రైతు బంధు రాకపోవడంతో పెట్టుబడికి అప్పులు చేయాల్సిన పరిస్థితి. బ్యాంకర్లు ఏటా వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేస్తున్నా, దానిని సరిగ్గా అమలు చేయడం లేదు. అనుకున్న స్థాయిలో టార్గెట్ రీచ్ కావడం లేదు. గతేడాది జనగామ జిల్లాలో క్రాప్ లోన్లు 53.38శాతం, అగ్రికల్చర్ టర్మ్ లోన్లు 61.94శాతం, ఎమ్ఎస్ఎంఈ లోన్లు 17.72శాతం మాత్రమే ఇచ్చారు. అటు రుణమాఫీ కూడా సర్కారు అమలు చేయకపోవడంతో లోన్లు కట్టాలని బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. కట్టకుంటే వడ్డీలు కట్టించుకుని, రెన్యూవల్ చేయిస్తున్నారు.

వడ్ల పైసలు పడ్తలే..
ఉమ్మడి వరంగల్​ జిల్లాలో యాసంగి వడ్ల పైసలు టైంకు పడ్తలేవు. దీంతో రైతులు అరిగోస పడుతున్నారు. మద్దతు ధరకు ఆశపడి సర్కారు కొనుగోలు సెంటర్​లలో అమ్మితే చుక్కలు చూపిస్తున్నారు. కొందరికి నెల రోజులైనా డబ్బులు పడని పరిస్థితి. వడ్లు సెంటర్​కు తెచ్చాక కాంటా అయ్యేందుకు వారం నుంచి పది రోజుల వరకు వేచి చేశారు. కాంటాలు అయ్యాక సెంటర్​నిర్వాహకులు ట్రక్​ షీట్లు ఇవ్వకుండా మిల్లుల్లో ధాన్యం అన్​లోడ్ అయ్యేంత వరకు జాప్యం చేస్తూ వచ్చారు. అన్​లోడ్ అయ్యాక ఆన్​లైన్​లో వివరాలు నమోదు చేయకుండా లేట్​చేస్తున్నారు. దీంతో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. కాలం నెత్తిమీదికి వచ్చినా రైతుల కష్టాలు పట్టించుకున్న వారు 
లేరు.

వడ్ల పైసలు పడ్తలేవ్..
మా ఊళ్లోని సర్కారు కొనుగోలు సెంటర్​లో గత నెల 10న వడ్లు పోసిన. 18వ తేదీన కాంటా అయినయ్​. లారీలు రాక 25వ తేదీన లోడింగ్​ అయి మిల్లుకు పోయినయ్​. 28 క్వింటాళ్ల వడ్లు  అయితే ట్రక్​ షీట్​ను ఇచ్చేందుకు నిర్వాహకులు నానా ఇబ్బందులు పెట్టిన్రు.  ​అడుగంగ అడుగంగ ఇచ్చిన్రు. వడ్లు మిల్లుకు పోయి కూడా 15 రోజులు అయింది. ఇప్పటి వరకు డబ్బులు పడ్తలేవు. అడిగితే పట్టించుకున్నోళ్లు లేరు. - హింగె భీమయ్య, రైతు, ఫతేషాపూర్, రఘునాథపల్లి మండలం జనగామ జిల్లా 

వడ్లు అమ్మి 20 రోజులైంది..
నాకున్న రెండెకరాలకు తోడు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని వడ్లు పండించిన.కొనుగోలు సెంటర్​లో వడ్లు అమ్మిన. కాంటా పెట్టి 20 రోజులైంది. ఇయ్యాల్టి వరకు డబ్బులు రాలె. సెంటర్ నిర్వాహకులను అడిగితే  డీఎం పెండింగ్ అని అంటున్నరు. వాళ్లను అడిగితే ప్రభుత్వం దగ్గర డబ్బులులేవంటున్నరు.అప్పులోళ్లు నా ఇంటి చుట్టూ తిరిగి పోతున్నరు. పెట్టుబడికి కూడా డబ్బులు లేవు.

- గోరిగ ఐలయ్య, రైతు, కోడూరు, రఘునాథపల్లి మండలం, జనగామ జిల్లా

అవగాహన కల్పిస్తున్నాం.. 
బాల్యవివాహాలను అరికట్టేందుకు అవేర్​నెస్​ ప్రోగ్రాంలు పెడుతున్నాం. స్కూళ్లు, కాలేజీల్లో  అవగాహన కల్పిస్తున్నాం. విలేజ్​ లెవల్​ చైల్డ్ మ్యారేజెస్​ ప్రొహిబిషన్​ కమిటీలు ఏర్పాటు చేసి వాటిని బలోపేతం చేస్తున్నాం. 

‑ వరలక్ష్మి, పీడీ,ఐసీడీఎస్​