- జూన్ 2 నుంచి కార్యకలాపాలు షురూ
- రైతు డిస్కమ్ సీఎండీ ఫారుఖీ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యుత్ వ్యాపార నిర్వహణలో రైతు డిస్కమ్ 42 శాతం వాటా కలిగి ఉందని ఆ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారుఖీ వెల్లడించారు. ఈ డిస్కమ్‌లో చేరిన ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. జూన్ 2 నుంచి రైతు డిస్కమ్ వ్యాపార కార్యకలాపాలు, సేవలను స్టార్ట్ చేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం విద్యుత్ ఉద్యోగుల, కార్మిక సంఘాల నాయకులతో సమీక్ష నిర్వహించారు. రైతు డిస్కం నిర్మాణం సమగ్రంగా, సమర్థంగా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న దక్షిణ, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలతో పాటు రైతు డిస్కం కూడా తెలంగాణ విద్యుత్ వ్యవస్థలో కీలక భాగంగా పనిచేస్తుందని తెలిపారు. వ్యాపార విభజనలో భాగంగా దక్షిణ డిస్కం 44%, రైతు డిస్కం 42%, ఉత్తర డిస్కం 14% బాధ్యతలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సుమారు 2 వేల మంది ఉద్యోగులతో రైతు డిస్కం ప్రారంభించనున్నామని అవసరాన్ని బట్టి సంఖ్యను మరింత పెంచే అవకాశముందని చెప్పారు. ఉద్యోగుల జీతభత్యాలు, నియమ, నిబంధనలు ఇతర విద్యుత్ సంస్థల మాదిరిగానే కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఉద్యోగంలో చేరేందుకు అపోహలొద్దు
విద్యుత్ శాఖ ఉద్యోగులు, కార్మికులు ఎలాంటి అపోహలు లేకుండా రైతు డిస్కమ్‌లో చేరవచ్చని సీఎండీ అన్నారు. రైతు డిస్కంతో ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రస్తుతం దక్షిణ, ఉత్తర డిస్కంల నుంచి ఉద్యోగులను డిప్యూటేషన్‌పై సమకూర్చుకున్నామని, భవిష్యత్తులో ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల నుంచి కూడా సమీకరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగ, కార్మిక సంఘాలకు చెందిన 65 మంది నేతలు పాల్గొన్నారు.

