నర్మెటలో రైతు మహోత్సవం.. మార్చి 22న పామాయిల్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

నర్మెటలో రైతు మహోత్సవం.. మార్చి 22న పామాయిల్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
  • పామాయిల్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ ప్రారంభం సందర్భంగా 20 నుంచి 22 వరకు నిర్వహణ

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఏర్పాటు చేసిన పామాయిల్‌‌ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఫ్యాక్టరీ ప్రారంభం అనంతరం బహిరంగ సభలో సీఎం మాట్లాడనున్నారు. పామాయిల్‌‌ ఫ్యాక్టరీ ప్రారంభం నేపథ్యంలో 20వ తేదీ నుంచి 22 వరకు మూడు రోజుల పాటు రైతు మహోత్సవం నిర్వహించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో 120 స్టాళ్లను ఏర్పాటు చేసి పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించడానికి ప్రణాళిక రూపొందించారు. 

ఇందులో భాగంగా బ్యాంకులు, ఎఫ్‌‌పీవోలు, వివిధ స్టార్టప్‌‌లతో పాటు ప్రైవేట్ కంపెనీల ఆఫీసర్లు, సైంటిస్ట్‌‌లతో రైతులకు ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మహోత్సవానికి ప్రతి రోజు ఐదు వేల మంది రైతులను తరలించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయనున్నారు. చివరి రోజైన 22న సీఎం హాజరయ్యే బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 30 వేల మంది రైతులను తరలించేందుకు ఆఫీసర్లు ఏర్పాటు చేస్తున్నారు. వారికి తాగునీరు, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు.

మహోత్సవం నిర్వహించే స్థలంలో హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఆధ్వర్యంలో మెడికల్‌‌ క్యాంపు నిర్వహించడంతో పాటు తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభా వేదిక నుంచే సీఎం రేవంత్‌‌రెడ్డి రైతుబంధు పంపిణీని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైతు మహోత్సవం నిర్వహించే ప్రాంగణంతో పాటు హెలిప్యాడ్‌‌ స్థలాన్ని కలెక్టర్‌‌ హైమావతి, సీపీ రష్మీ పెరుమాల్‌‌తో పాటు పలువురు ఆఫీసర్లు పరిశీలించారు. 

రైతు మహోత్సవంతో పాటు బహిరంగ సభ నేపథ్యంలో వ్యవసాయ, పశు సంవర్థక, హార్టికల్చర్, విద్యుత్, వైద్య, పంచాయతీ రాజ్, మిషన్‌‌ భగీరథ, ఆర్‌‌అండ్‌‌బీ, ఆయిల్‌‌ ఫెడ్‌‌ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌‌ హైమావతి ఆఫీసర్లను ఆదేశించారు.