రైతు నేస్తంతో  రైతులు, సైంటిస్టుల మధ్య కనెక్టివిటీ: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రైతు నేస్తంతో  రైతులు, సైంటిస్టుల మధ్య కనెక్టివిటీ: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, వెలుగు: రైతులకు సాగులో నూతన టెక్నాలజీని నేరుగా అందించడంతో పాటు రైతులు, సైంటిస్టులు, అధికారుల మధ్య అనుసంధానం కల్పించడమే ‘రైతునేస్తం’ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌లోని సెక్రటేరియెట్‌‌‌‌లో నిర్వహించిన ‘రైతునేస్తం’ 100వ ఎపిసోడ్‌‌‌‌కు ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా1,600 రైతు వేదికల ద్వారా లక్షలాది మంది రైతులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు వర్చువల్‌‌‌‌గా హాజరయ్యారు.

గత ప్రభుత్వం నిరుపయోగంగా వదిలేసిన రైతు వేదికలను తాము అధికారంలోకి వచ్చాక డిజిటల్ విజ్ఞాన కేంద్రాలుగా, జ్ఞాన వేదికలుగా తీర్చిదిద్దామని మంత్రి తెలిపారు. సీఎం చేతుల మీదుగా 2024, మార్చి 6న ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతంగా 100 ఎపిసోడ్‌‌‌‌లు పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు.

దేశంలోనే తొలి డిజిటల్ వేదికగా గుర్తింపు
రైతులు, సైంటిస్టులను నేరుగా అనుసంధానం చేస్తున్న ‘రైతునేస్తం’ దేశంలోనే తొలి డిజిటల్ వేదికగా నిలిచిందని మంత్రి తుమ్మల ప్రశంసించారు. ఇప్పటివరకు ఈ ప్రోగ్రామ్‌‌‌‌లో 24.85 లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా పాల్గొనగా, వారిలో 5.26 లక్షల మంది మహిళా రైతులు ఉండటం విశేషమన్నారు. ప్రతి వారం రైతులు అడిగే ప్రశ్నలకు సైంటిస్టులు నేరుగా సమాధానాలు ఇస్తుండటంతో, సాగులో సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతోందని చెప్పారు.