ఇయ్యాల్టి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు

ఇయ్యాల్టి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: యాసంగి రైతుబంధు సాయం బుధవారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ సీజన్‌‌‌‌లో 70.54 లక్షల మంది రైతులకు చెందిన కోటి 53 లక్షల 53 వేల ఎకరాలకు రూ.7,676.61 కోట్లు విడుదల చేయడానికి వ్యవసాయశాఖ సన్నద్ధమైంది. బుధవారం ఎకరం భూమి ఉన్న రైతులకు రైతుబంధు అందనుంది. గురువారం రెండు ఎకరాల రైతులకు.. ఇలా రోజుకు ఎకరం పెంచుతూ  గతంలో ఇచ్చినట్లుగా జమ చేయనున్నారు. ఈ స్కీమ్​ ప్రారంభమైనప్పటి నుంచి 9 విడుతల్లో రూ.57,882.67 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. తాజాగా పదో విడతతో ఈ మొత్తం రూ.65,559.28 కోట్లకు చేరనుంది.

కేంద్రం తీరు మారాలి : మంత్రి నిరంజన్‌‌‌‌రెడ్డి

రైతు కేంద్రంగా పాలన సాగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌‌‌‌రెడ్డి అన్నారు. అన్నం పెట్టే రైతు యాచించే స్థితిలో కాదు.. శాసించే స్థానంలో ఉండాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని పేర్కొన్నారు. దేశాన్ని పాలిస్తున్న పాలకులకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇప్పటికైనా రైతుల విషయంలో కేంద్రం తీరు మారాలన్నారు. గత వానాకాలం 65 లక్షల మంది అర్హులైన రైతులకు రూ.7,434.67 కోట్ల రైతుబంధు నిధులు కేటాయించామని, ఈ సీజన్‌‌‌‌లో రైతులు, నిధులు పెరిగాయని ఆయన తెలిపారు.