రైతు డిస్కమ్‌తో రైతాంగానికి నష్టం!..లైసెన్స్ రాకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటది: నిరంజన్‌రెడ్డి

రైతు డిస్కమ్‌తో రైతాంగానికి నష్టం!..లైసెన్స్ రాకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటది: నిరంజన్‌రెడ్డి
  •  నెల 29న ఈఆర్సీ బహిరంగ విచారణలో కేటీఆర్‌తో పాటు పాల్గొంటానన్న మాజీ మంత్రి

హైదరాబాద్​, వెలుగు: రైతు డిస్కమ్ వల్ల రాష్ట్ర రైతాంగానికి ఎంతో నష్టమని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ లీడర్ ఎస్. నిరంజన్ రెడ్డి అన్నారు. మూడో డిస్కమ్‌కు లైసెన్స్ రాకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటదని ఆయన చెప్పారు. ఆదివారం రాష్ట్ర రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫోరం ఆధ్వర్యంలో ‘రైతు డిస్కమ్--ప్రకటిత లక్ష్యాలు--ఆచరణ సవాళ్లు’ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

ఈ సమావేశం ఫోరం అధ్యక్షుడు సి.మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి తుల్జారాంసింగ్ ఠాకూర్ అధ్యక్షతన జరుగగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్​రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 29న ఈఆర్సీ నిర్వహించే బహిరంగ విచారణలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్‌తో పాటు తానూ పాల్గొంటానని స్పష్టం చేశారు. ఈఆర్సీ నుంచి లైసెన్స్ జారీ కాకముందే జూన్ 2న రైతు డిస్కమ్‌ను అధికారికంగా ప్రారంభించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం సరికాదన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నారని ప్రశ్నించారు. 

ఎవరి లాభం కోసం రైతు డిస్కమ్? ప్రశ్నించిన నిపుణులు

మూడు గంటలకు పైగా జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న నిపుణులంతా ఎవరి లాభం కోసం రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భాగస్వామ్య పక్షాలైన ఉద్యోగ సంఘాలు, రైతు ప్రతినిధులు, విద్యుత్ వినియోగదారులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ పక్షాలతో సమగ్ర సంప్రదింపులు జరపకుండా రైతు డిస్కమ్ ఏర్పాటు ప్రక్రియను ఏకపక్షంగా చేయడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.