పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి, టాప్ సీడ్ అరినా సబలెంకా అనూహ్యంగా పరాజయం పాలైంది. బుధవారం జరిగిన హోరాహోరీ పోరులో అన్‌సీడెడ్ ప్లేయర్డయానా ష్నైడర్ 3–-6, 7–-5, 6–-0 స్కోరుతో సబలెంకాపై అద్భుత విజయం సాధించి టోర్నీ నుంచి ఇంటికి పంపింది.
నాలుగు సార్లు మేజర్ టైటిల్ గెలిచిన సబలెంకా, రెండో సెట్‌లో 4 –1 ఆధిక్యంతో నిలిచి సులువుగా గెలిచేలా కనిపించింది. మ్యాచ్ కోసం సర్వీస్ చేస్తూ విజయానికి 2 పాయింట్ల దూరంలో ఉన్న దశలో ఒక్కసారిగా ఒత్తిడికి లోనై మ్యాచ్‌ను చేజార్చుకుంది. తన కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్ ఆడుతున్న ష్నైడర్ అద్భుతంగా పుంజుకుని సబలెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసింది.
నిర్ణయాత్మక మూడో సెట్‌లో పూర్తిగా నిరాశపరిచిన బెలారస్ ప్లేయర్సబలెంకా చివరి 13 గేమ్‌ల్లో 12 కోల్పోయి మ్యాచ్‌ను నెట్‌కు కొట్టి ఓటమిని కొనితెచ్చుకుంది. మరో మ్యాచ్‌లో అన్‌సీడెడ్ పోలిష్ ప్లేయర్, క్వాలిఫైయర్ మాయా చ్వాలిన్స్కా తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ 22వ సీడ్ అన్నా కలస్కాయాను 7-–6 (3), 6–-3 తేడాతో ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఈ విజయంతో రోలాండ్ గారోస్‌లో సెమీస్ చేరిన రెండో పోలిష్ మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. ఈ టోర్నీకి ముందు ఏ మేజర్‌లోనూ రెండో రౌండ్ దాటని 24 ఏళ్ల చ్వాలిన్స్కా, సెమీస్ చేరడం ద్వారా ఏకంగా 750,000 యూరోల ప్రైజ్ మనీని ఖాయం చేసుకుంది.
