మీ రాజకీయ లక్ష్యం ఏమిటి? : ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్

మీ రాజకీయ లక్ష్యం ఏమిటి? : ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్
  •     పీసీసీ ఉపాధ్యక్షులను ప్రశ్నించిన ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్

హైదరాబాద్, వెలుగు: మీ రాజకీయ లక్ష్యం ఏమిటి? రాష్ట్రంలో ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల అమలుతీరు ఎలా ఉంది?  జనం నుంచి ఎలాంటి స్పందన వస్తున్నది?  ప్రజల్లో పార్టీకి ఎలాంటి ఆదరణ ఉంది? అంటూ పీసీసీ ఉపాధ్యక్షులపై ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ప్రశ్నల వర్షం కురిపించి సమాధానాలు రాబట్టారు.  మంగళవారం రెండో రోజు కూడా గాంధీ భవన్ లో ఆయన పలువురు పీసీసీ ఉపాధ్యక్షులతో భేటీ అయ్యారు. పీసీసీ ఉపాధ్యక్షులుగా పదవి చేపట్టిన ఆరు నెలల కాలంలో పార్టీ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు?  రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే ప్రణాళికతో ఉన్నారు? లాంటి వివరాలు ఆరా తీశారు. 

అనంతరం ఐదు ప్రశ్నలతో కూడిన ఒక పేపర్ ను పీసీసీ ఉపాధ్యక్షులకి ఇచ్చి వాటికి సమాధానం రాసి ఇవ్వాలని కోరారు. పీసీసీ ఉపాధ్యక్ష పదవితోనే ఆగిపోకూడదని, రాజకీయంగా ఇంకా మరెన్నో ఉన్నత పదవులు పొందేందుకు ఈ పదవిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి సూచించారు.  ఇదే సమయంలో  పార్టీ కార్యకర్తల అభిప్రాయాలనూ అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదని, రెండున్నరేళ్లుగా వారికి ఏ పదవులు లేక తీవ్రమైన నిరాశ, నిస్పృహలతో ఉన్నారని వైస్ ప్రెసిడెంట్లు వివరించారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని, ఈ విషయంలో కొంత ఆలస్యం అవుతున్నా న్యాయం జరుగుతుందని సచిన్ సావంత్​హామీ ఇచ్చినట్లు తెలిసింది.