నిరుద్యోగుల ఆశలపై సీఎం నీళ్లు చల్లారు.. నిరుద్యోగుల ఆశలపై ..సీఎం నీళ్లు చల్లారు

నిరుద్యోగుల ఆశలపై  సీఎం నీళ్లు చల్లారు.. నిరుద్యోగుల ఆశలపై ..సీఎం నీళ్లు చల్లారు
  • అఖిలపక్షం ఆధ్వర్యంలో సడక్ బంద్
  • టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులను తొలగించాలని డిమాండ్ 

నెట్​వర్క్, వెలుగు :  పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు పొందుతామని ఆశించిన స్టూడెంట్లు, నిరుద్యోగుల ఆశలు అడియాసలుగానే మారాయంటూ శనివారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో సడక్  బంద్  నిర్వహించారు. జడ్చర్లలోని 44వ నంబర్  జాతీయ రహదారిపై కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఇతర పార్టీలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నేతలు నినదించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్  రెడ్డి మాట్లాడుతూ.. లక్ష ఉద్యోగాలు కల్పిస్తానని కల్లబొల్లి మాటలు చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నోటిఫికేషన్లను వేయడం మరిచిపోయారని, వేసిన కొద్దిపాటి నోటిఫికేషన్లకు కూడా నియామకాలు సరిగ్గా చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. పోటీ పరీక్షల అభ్యర్థి   ప్రవల్లిక ఆత్మహత్యకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలన్నారు. అనంతరం 200 మంది అఖిలపక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. బీఎస్పీ ఆధ్వర్యంలో జోగుళాంబ జిల్లాలోని ఉండవల్లి మండలం 44వ  నంబర్ జాతీయ రహదారిపై పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర అఖిల పక్షాలు సడక్ బంద్  నిర్వహించాయి. 

టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులను తొలగించాలని, ప్రవల్లిక ఆత్మహత్యకు సర్కారే బాధ్యత వహించాలని డిమాండ్  చేస్తూ సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, టీజేఎస్, టీడీపీ, ప్రజా సంఘాల నాయకులు కరీంనగర్  సిటీలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద  సడక్  బంద్ నిర్వహించారు. ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్ సమీపంలో ఉన్న హైదరాబాద్  వెళ్లే ప్రధాన రహదారిపై ఆయా పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు పెద్ద సంఖ్యలో సడక్ బంద్  చేపట్టాయి. టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశాయి. సడక్  బంద్  నిర్వహించిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

గ్రేటర్ హైదరాబాద్​లో..

ఎల్​బీనగర్/షాద్​నగర్ :  హయత్​నగర్​లోని విజయవాడ హైవేపై సీపీఐ, సీపీఐఎంల్, ప్రజాపంథా, బీఎస్పీ, టీజేఎస్ పార్టీల నాయకులు సడక్ బంద్ నిర్వహించారు. ప్రవళిక ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విపక్షాల ధర్నా సందర్బంగా హైదరాబాద్– -విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాస్తారోకో చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి అబ్దుల్లాపూర్​మెట్ పీఎస్​కు తరలించారు. షాద్​నగర్​లోని బెంగళూరు హైవేపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి షాద్ నగర్ పీఎస్​కు తరలించారు. పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ..  టీఎస్పీఎస్సీ చైర్మన్​ సహా బోర్డు సభ్యులను తొలగించి కొత్తవారిని నియమించాలన్నారు.