భారతీయ నావికుల భద్రతే మాకు అత్యంత ముఖ్యం: ట్రంప్‎కు తేల్చిచెప్పిన మోడీ

భారతీయ నావికుల భద్రతే మాకు అత్యంత ముఖ్యం: ట్రంప్‎కు తేల్చిచెప్పిన మోడీ

పారిస్: లక్షలాది మంది భారతీయ నావికుల భద్రత, రక్షణ భారతదేశానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‎తో అన్నారు. ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా బుధవారం (జూన్ 17) ప్రధాని మోడీ, ట్రంప్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఇరు దేశాల సంబంధాలు, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. 

ఇటీవల గల్ఫ్ తీరంలో భారతీయ నావికులతో ప్రయాణిస్తోన్న వాణిజ్య నౌకలపై అమెరికా దళాలు దాడులు చేసిన అంశాన్ని ప్రధాని మోడీ ఈ సందర్భంగా ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధితో సహా ప్రపంచవ్యాప్త సముద్ర వాణిజ్య మార్గాలలో లక్షలాది మంది భారతీయ నావికులు తమ విధులను నిర్వర్తిస్తూ ప్రపంచ పురోగతికి ఎంతగానో దోహదపడుతున్నారు. 

వారి భద్రత మాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయమని అన్నారు. సముద్ర వాణిజ్య మార్గాల్లో నౌకాయాన స్వేచ్ఛను నిర్ధారించాలని పిలుపునిచ్చారు. ఇరాన్ అమెరికా మధ్య కుదరనున్న ఒప్పందంలో నావికుల భద్రత అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నానని అన్నారు. 

హార్మూజ్ రీఓపెన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకం:

నెలల తరబడి ఉద్రిక్తతలతో రణరంగంగా మారిన పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా ప్రెసిడెంట్ తీవ్రంగా కృషి చేశారని ప్రధాని మోడీ కొనియాడారు. అమెరికా, ఇరాన్ ఇరుబృందాలు కలిసి పనిచేయడం సంతోషకరమని అన్నారు. హార్మూజ్ రీఓపెన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమన్నారు. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో భారత నేవీ, సిబ్బంది రక్షణకు మాకు అత్యంత ముఖ్యమని మోడీ స్పష్టం చేశారు. 

►ALSO READ | త్వరలో భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్.. ఇండియాపై దాడి జరిగితే అండగా మేముంటాం

భారత నావికుల మృతి తీరని నష్టం: ట్రంప్

గల్ఫ్ తీరంలో భారతీయ నావికులతో ప్రయాణిస్తోన్న వాణిజ్య నౌకపై అమెరికా దళాలు చేసిన దాడుల్లో ముగ్గురు ఇండియన్స్ చనిపోయిన ఘటనపై ట్రంప్ స్పందించారు. భారతీయ నావికుల మృతి తీరని నష్టమని విచారం వ్యక్తం చేశారు. నౌకల దిగ్భంధం వంద శాతం ప్రభావం చూపించిందన్నారు. మోడీ నాయకుడిగా ఉన్నంతకాలం భారత్‎ను కాపాడుతామని కీలక వ్యాఖ్యలు చేశారు. నేవీ సిబ్బంది భద్రతా విషయంలో ఇండియాతో కలిసి పని చేస్తామని చెప్పారు.