కాశ్మీర్​లో 9వేల ఎకరాల్లో కుంకుమ పువ్వు సాగు

కాశ్మీర్​లో 9వేల ఎకరాల్లో కుంకుమ పువ్వు సాగు
  • కుంకుమ పువ్వు కిలో రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షలు పలుకుతున్న ధర
  • జమ్మూ కశ్మీర్​లో గతేడాదితో పోలిస్తే ఉత్పత్తి డబుల్
  • పుల్వామాలోని పాంపోర్​లో రైతులు బిజీ బిజీ
  • కాశ్మీర్​లో 9వేల ఎకరాల్లో సాగు
  • టూరిస్టులను ఆకట్టుకుంటున్న పువ్వులు

శ్రీనగర్​: కుంకుమ పువ్వు.. అనగానే గుర్తుకొచ్చేది కాశ్మీర్. ఇండియాలో హై క్వాలిటీ సాఫ్రాన్​ కాశ్మీర్​లో తప్ప మరెక్కడా దొరకదు. వరల్డ్​ వైడ్​గా చూసుకున్నా.. కాశ్మీరీ కుంకుమ పువ్వుకు చాలా డిమాండ్​ ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో కుంకుమపువ్వు ఒకటి. కొండ ప్రాంతాల్లోని పొడి నేలలో ఇది ఎక్కువగా పండుతుంది. తాజాగా పుల్వామా జిల్లా పాంపోర్​లో సాఫ్రాన్​ సాగు మస్త్​ లాభాలు ఇస్తున్నది. చాలా ఏండ్ల తర్వాత వర్షాలు బాగా పడటంతో కుంకుమ పువ్వు ప్రొడక్షన్​ పెరిగిందని అక్కడి రైతులు చెబుతున్నారు. పువ్వు చేతికి రావడంతో, రైతు కుటుంబాలన్నీ ఇప్పుడు సాఫ్రాన్​ సేకరణలో బిజీ బిజీగా ఉంటున్నాయి. కాశ్మీరీ కుంకుమ పువ్వు కిలో రూ.3.50 లక్షల నుంచి 4లక్షల వరకు ఉంటుందని, ఇక్కడి సాఫ్రాన్​ను బంగారంతో సమానంగా చూస్తారని ఫర్హద్​ హుస్సేన్​ చెప్పాడు. అందుకే కుంకు పువ్వును ‘రెడ్​ గోల్డ్’గా పిలుస్తారని తెలిపాడు. గతేడాదితో పోలిస్తే ప్రొడక్షన్​ డబుల్​ అయ్యిందని ఆనందం వ్యక్తం చేశాడు. 

కుంకుమ పువ్వు సేకరణలో బిజీ.. బిజీ..

కాశ్మీర్​ రీజియన్​లో వందలాది కుటుంబాలు కుంకుమ పువ్వునే సాగు చేస్తుంటాయి. సుమారు 9వేల ఎకరాల్లో పండిస్తారు. పుల్వామా జిల్లాలోని పాంపోర్​ ఏరియాలో సాగు ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ఆశించినదానికంటే ఎక్కువ దిగుబడి వచ్చిందని నసీర్​ హమీద్​ అనే రైతు ఆనందం వ్యక్తం చేశాడు. కుంకుమ పువ్వు సేకరణలో తన ఫ్యామిలీ అంతా బిజీ అయిపోయిందని చెప్పాడు. ఈ ప్రాంతమంతా సాఫ్రాన్​ సాగుపైనే ఆధారపడి జీవిస్తుందన్నారు. ప్రభుత్వం కాశ్మీరీ కుంకుమ పువ్వుకు జియోగ్రాఫికల్​ ఇండికేషన్​ (జీఐ) ట్యాగింగ్​ ఇచ్చిందని తెలిపాడు. ఇలా చేయడంతో ప్రతీ ఒక్కరికీ కాశ్మీరీ క్వాలిటీ సాఫ్రాన్​ దొరుకుతుందని వివరించాడు. జీఐ ట్యాగింగ్​తో రైతులకు కూడా ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారని చెప్పాడు. పాంపోర్​ నుంచే ఇండియాతో పాటు ప్రపంచ దేశాలకు కుంకుమ పువ్వు ఎక్స్​పోర్ట్​ అవుతుందని తెలిపాడు. గతంతో పోలిస్తే సేల్స్​ కూడా రెట్టింపు అయ్యాయని తెలిపాడు.

టూరిస్టులకు స్పెషల్​ అట్రాక్షన్​గా పాంపోర్​

వరల్డ్స్​ బెస్ట్​ సాఫ్రాన్​ సాగును చూసేందుకు టూరిస్టులు స్పెషల్​గా పుల్వామాలోని పాంపోర్​కు వస్తుంటారు. ఈ ఏడాది ప్రొడక్షన్​ బాగుండటంతో, వారం రోజుల నుంచి వందలాది మంది టూరిస్టులు కుంకుమ పువ్వు సాగును చూసి వెళ్తున్నారు. సేకరణ నుంచి ప్యాకింగ్​ దాకా ప్రతీ అంశాన్ని దగ్గరుండి పరిశీలిస్తున్నారు. మెరూన్, ఎల్లో, పుర్పుల్​ కలర్స్​లో కనిపించే పువ్వులను చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతుల శ్రమను మెచ్చుకుంటున్నారు. కొంతమంది టూరిస్టులు కుంకుమ పువ్వును కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. దాల్​ లేక్, పహల్గం, గుల్​మార్గ్​తో పాటు కుంకుమ పువ్వు పొలాలు కూడా కాశ్మీర్​లోని టూరిస్ట్​ స్పాట్స్​లో ఒకటిగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం కూడా పాంపోర్​లో సాఫ్రాన్​ పార్క్​ను ఏర్పాటు చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో ప్రాసెసింగ్, ప్యాకేజింగ్​ చేసి ఎక్స్​పోర్ట్​ చేస్తున్నది. కుంకుమ పువ్వు వాడకం ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పూజా సామగ్రి, స్వీట్లు, సెంట్లను తయారు చేయడానికి కూడా సాఫ్రాన్​ ఉపయోగిస్తారు.