V6 News

సాయిబాబాపై దుష్ప్రచారాన్ని సహించం..సాయిబాబా ఐక్యవేదిక హెచ్చరిక

సాయిబాబాపై దుష్ప్రచారాన్ని సహించం..సాయిబాబా ఐక్యవేదిక హెచ్చరిక

పంజాగుట్ట, వెలుగు: షిరిడి సాయిబాబాపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని షిరిడి సాయిబాబా ఐక్యవేదిక తెలిపింది.శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో జరిగిన సమావేశంలో వేదిక అధ్యక్షుడు మంచికంటి ధనంజయ మాట్లాడుతూ.. కోట్లాది మంది సాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

సాయిబాబాను హిందువులే కొలుస్తున్నారని, ఆలయాల్లో అన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయని గుర్తు చేశారు. బాబా ఆలయాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే చెబితే సరిచేసుకుంటాం కానీ, అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని కోరారు. పీఠాధిపతులు, ప్రవచనకారులు సైతం బాబాను దత్తాత్రేయ స్వరూపంగా కొలుస్తారని, గురు పౌర్ణమి వైభవం కేవలం బాబా ఆలయాల్లోనే కనిపిస్తుందని గుర్తు చేశారు.

బాబా బోధనల వల్ల ఎంతో మంది దురలవాట్లకు దూరమై భక్తి మార్గంలో నడుస్తున్నారని తెలిపారు. బాబాను ‘సాయిబు’ అని పిలుస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పి.వి. సాయి, ఖజాంచి గుండా మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.