- ప్రజలను ఇబ్బంది పెడితే కేసులు పెడతాం
- పెండ్లిళ్లు, పేరంటాలు జరిగితే వేలకు వేలు డిమాండ్
- గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరుతో లా అండ్ఆర్డర్కు భంగం
- మానుకోకపోతే యాక్షన్.. సీపీ సజ్జనార్ వార్నింగ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: బలవంతపు వసూళ్లకు పాల్పడితే కేసులు పెడతామని ట్రాన్స్‌జెండర్లను హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. వారికి ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని గౌరవప్రదంగా బతకాలని కోరారు. అమీర్ పేటలోని సెంటర్ పర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్) ఆడిటోరియంలో 250 మంది ట్రాన్స్ జెండర్లతో సిటీ పోలీసులు సమావేశం నిర్వహించారు. దీనికి సీపీ సజ్జనార్అధ్యక్షతన వహించగా సీఐడీ, మహిళా భద్రతా విభాగ అడిషనల్ ఏడీజీ చారు సిన్హా పాల్గొన్నారు.
ఫంక్షన్లు జరిగితే వేధింపులు
సజ్జనార్మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్ల మధ్య గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు శాంతిభద్రతల సమస్యలకు, ప్రాణ నష్టానికి కారణమవుతోందన్నారు. ఈ మధ్య ట్రాన్స్ జెండర్లపై ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, పెండ్లిళ్లు, ఫంక్షన్లు జరిగితే ఇండ్లపై పడి యజమానులను వేలకు వేలు ఇవ్వాలని వేధిస్తున్నారన్నారు. ఇ క నుంచి ఇలా చేస్తే కటకటాల్లో పంపిస్తామన్నారు.
ప్రైడ్ ప్లేస్ను ఆశ్రయించండి
ఏడీజీ చారు సిన్హా మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్ల సమస్యలను పరిష్కరించడానికే మహిళా భద్రత విభాగంలో ‘ప్రైడ్ ప్లేస్’ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎవరైనా వేధించినా నిరభ్యంతరంగా ఈ వింగ్‌ను ఆశ్రయించవచ్చని తెలిపారు.
ట్రాన్స్ జెండర్ల సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి మహిళా భద్రతా విభాగం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్, వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్, విమెన్ సేఫ్టీ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్, సైబరాబాద్ డీసీపీ సృజన పాల్గొన్నారు.
