- ఇద్దరు యూఎస్ సోల్జర్లు మృతి
- ప్రతీకారంగా ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా
- గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్‌లపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడి
- యుద్ధంలో ఇప్పటివరకు 16 మంది అమెరికా సైనికుల మృతి, 430 మందికి గాయాలు
టెహ్రాన్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మధ్య దాడులు, ప్రతిదాడులు మరింత ఉధృతమయ్యాయి. జోర్డాన్‌లోని బేస్‌పై ఇరాన్ శనివారం జరిపిన దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు చనిపోగా.. ఇరాన్‌పై అమెరికా ఆదివారం దాడులను మరింత తీవ్రం చేసింది. సైనికుల మృతికి ప్రతీకారంగా ఇరాన్ పారామిలిటరీ విభాగం ఐఆర్జీసీ బలగాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం భీకర దాడులు చేపట్టింది.
ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలు, నైరుతి ఇరాన్‌లో నిర్మించ తలపెట్టిన అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణ స్థలం సహా ఇతర లక్ష్యాలను అమెరికా ధ్వంసం చేసింది. హార్మూజ్ జలసంధిని నియంత్రించే ఇరాన్ సామర్థ్యాన్ని తగ్గించడానికి, ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి ఆయుధశాలను నియంత్రించే అక్కడి ప్రభుత్వంలో కీలక అధికార కేంద్రమైన ఐఆర్జీసీ దళాలను శిక్షించడానికి ఈ దాడులను చేపట్టినట్టు పేర్కొంది. దీంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులు కొనసాగించింది.
కాగా, జోర్డాన్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో జరిపిన భారీ దాడిని తిప్పికొట్టే క్రమంలో ఇద్దరు అమెరికా సోల్జర్లు మరణించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్(సెంట్‌కామ్) ధృవీకరించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మరణించిన అమెరికా సైనికుల సంఖ్య16కు, గాయపడినవారి సంఖ్య 430కి పెరిగింది. మరోవైపు, అమెరికా తాజా దాడుల్లో 50 మంది మరణించారని, 517 మంది గాయపడ్డారని ఇరాన్ అధికారులు ఆదివారం తెలిపారు.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు
కువైట్‌లోని విద్యుత్, ఉప్పునీటి శుద్ధి ప్లాంట్లలో ఒకదానిపై రెండు రోజుల్లో ఇరాన్ రెండోసారి దాడి చేసిందని, దీనివల్ల మంటలు చెలరేగాయని అక్కడి ప్రభుత్వం తెలిపింది. విద్యుత్ గ్రిడ్ స్థిరంగానే ఉందని విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్ తాగునీటి అవసరాల్లో 90% ఈ ఉప్పునీటి శుద్దీకరణ ప్లాంటే తీరుస్తుంది.
పర్షియన్ గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాలతో పాటు జోర్డాన్‌లోనూ ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు దూసుకు వస్తున్నాయనే హెచ్చరికలతో కువైట్, బహ్రెయిన్ ఆదివారం తమ వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశాయి.
