అరకొర జీతాల్లోనూ కోతలు

అరకొర జీతాల్లోనూ కోతలు
  • గోపాల మిత్రలు గోస పడ్తున్రు
  • టార్గెట్​ రీచ్​ కాలేదని వేతనాల్లో కోతలు
  • ఉద్యోగాల్లో నుంచి  తీసేస్తామని బెదిరింపులు


భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు :  ఆర్నెల్లుగా జీతాలు రాక గోపాల మిత్రలు తిప్పలు పడుతున్నారు.  ఓ వైపు వేతనాలు లేక మరోవైపు కృత్రిమ గర్భధారణలో టార్గెట్​ రీచ్​ కాలేదంటూ వేతనాల్లో కోత విధించడంతో అల్లాడుతున్నారు. స్వరాష్ట్రంలో వెట్టి చాకిరి చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అరకొర జీతాల్లోనూ కోతలు

కృత్రిమ గర్భధారణ చేసి పశువులను వృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం నిరుద్యోగులైన యువకులను గోపాలమిత్రలుగా 20 ఏళ్ల కింద నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,530 మందికి పైగా గోపాల మిత్రలు సేవలందిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 260 మంది ఉన్నారు. జిల్లాలో 3,19,911 పశువులు ఉన్నాయి. పశువుల్లో కృత్రిమ గర్భధారణతో పాటు  జీవాలకు వ్యాక్సిన్​ వేయడం వంటి పనులను చూస్తారు. నెలకు రూ. 8,500 గౌరవ వేతనంతో వీరు పని చేస్తున్నారు. పశువుల సంఖ్యను బట్టి గోపాల మిత్రలకు వారి పరిధిలో కృత్రిమ గర్భధారణ టార్గెట్​ విధిస్తున్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ గర్భధారణకు రైతులు ప్రాధాన్యత ఇస్తుండడంతో కృత్రిమ గర్భధారణ టార్గెట్​ రీచ్​ కాని పరిస్థితి నెలకొంది. దీంతో గోపాలమిత్ర జీతాల్లో అధికారులు కోత విధిస్తున్నారు. అసలే అంతంత మాత్రం జీతాలతో ఇబ్బంది పడుతున్న తమకు టార్గెట్​ రీచ్​ కాలేదంటూ వేతనంలో కోత విధించడంతో కొందరికి రూ.3 వేల నుంచి రూ.4 వేలే వస్తోందని వాపోతున్నారు. వరుసగా మూడు నెలలు టార్గెట్​ రీచ్​ కాకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామంటూ అధికారులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే అరకొర జీతమైనా ప్రతి నెలా చెల్లించకపోవడంతో అప్పులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు.

జీతాల విషయమై అధికారులను అడిగితే బడ్జెట్​ అలాట్​​ కాలేదని, రేపుమాపంటూ కాలం వెళ్లదీస్తున్నారని వాపోతున్నారు. త్వరలో జీతాలొస్తాయి. గ్రాంట్​ ఇన్​ ఎయిడ్​ కింద మూడు నెలలకోసారి జీతాలు వస్తాయి. ఆర్నెల్ల జీతాలు రావాల్సి ఉంది. త్వరలో జీతాలు వచ్చే అవకాశం ఉంది. 
-
కిశోర్, ఏవో, గోపాలమిత్ర విభాగం