టూవీలర్ల అమ్మకాలు తగ్గుతయ్‌!

టూవీలర్ల అమ్మకాలు తగ్గుతయ్‌!

న్యూఢిల్లీ: టూవీలర్‌ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి 1–4 శాతం వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని క్రెడిట్‌ రేటింగ్‌ ఫర్మ్‌ ఇక్రా స్టడీ రిపోర్టు తెలిపింది. టూవీలర్‌ ధరలతోపాటు పెట్రోల్‌ రేట్లూ పెరగడమే ఇందుకు కారణం. ఈసారి ఫెస్టివల్‌ సీజన్‌లో ఆశించినంతగా టూవీలర్‌ అమ్మకాలు లేవు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి అక్టోబరు మధ్య 85 లక్షల టూవీలర్లు అమ్ముడయ్యాయి. ఫైనాన్సర్లు కూడా వీటికి లోన్లు ఇవ్వడాన్ని తగ్గిస్తున్నారు.  మొత్తం టూవీలర్ల అమ్మకాల్లో 15 శాతం వాటా ఉన్న ప్రీమియం టూవీలర్లకు మాత్రం డిమాండ్ కొద్దిగా పెరుగుతోంది. అయితే సెమీ కండక్టర్ చిప్ కొరత కారణంగా ఓఈఎంలు (ఒరిజనల్‌ ఎక్విప్‌మెంట్‌ మేకర్‌) సరఫరా సమస్యలను ఎదుర్కొంటున్నాయి.  పండుగ సీజన్ ముగిసినా డీలర్‌షిప్‌ల వద్ద 45 రోజులకు సరిపడా ఇన్వెంటరీ ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలల్లోనూ హోల్‌సేల్ అమ్మకాలు పెరిగే అవకాశాలు కనిపించడం లేదు.

అగ్గువ ధర బండ్లు కూడా అమ్ముడుపోలే..

‘‘టూవీలర్ల అమ్మకాల్లో ఎంట్రీ–సెగ్మెంట్ (75–110 సీసీ) బండ్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి.  ఈ సంవత్సరం ఈ సెగ్మెంట్‌ అమ్మకాలు కూడా పడిపోయాయి. టూవీలర్ల అమ్మకాలపై కరోనా సెకండ్‌వేవ్‌ ఎఫెక్ట్‌ ఇప్పటికీ ఉంది. తక్కువ ఆదాయం కలిగిన వాళ్లు పండుగ సీజన్‌లోనూ వెహికల్స్‌ కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయలేదు’’  అని ఇక్రా సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ రోహన్ కన్వర్ గుప్తా అన్నారు.