బీజేపీని ఓడించేందుకు అన్నివర్గాలు ఏకమవ్వాలి : ప్రొ.సింహాద్రి

బీజేపీని ఓడించేందుకు అన్నివర్గాలు ఏకమవ్వాలి : ప్రొ.సింహాద్రి

బషీర్ బాగ్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో మతతత్వ బీజేపీని ఓడించేందుకు అన్ని వర్గాలు ఏకతాటిపైకి రావాలని సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.సింహాద్రి పిలుపునిచ్చారు. ‘లోక్ సభ ఎన్నికలు, రాజ్యాంగ పరిరక్షణ’ అనే అంశంపై సోమవారం సింహాద్రి అధ్యక్షతన బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమాజ్ వాదీ పార్టీ, ఇండియా అలయన్స్ పార్టీ, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సింహాద్రి మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసి, రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు.

ప్రజాస్వామ్యం బలహీనమైపోయిందని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. అధ్యక్ష పాలన, ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కులగణన నిర్వహించి సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని కోరారు. బీసీ కులాల్లో నాయకత్వాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ ప్రొఫెసర్ తిరుమలి మాట్లాడుతూ.. బీసీలు రాజకీయ అవగాహన పెంచుకోవాలని తెలిపారు. కింది కులాలను కలుపుకుపోయినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు.

ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. పదేళ్లలో దేశంలోని అన్ని వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఎలక్షన్ బాండ్ల పేరుతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి బీజేపీ తెరతీసిందన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా భారీగా అంతరాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు పీపుల్స్ డాక్యుమెంటరీని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, రైతులకు ఆయన పిలుపునిచ్చారు. ప్రజా తెలంగాణ కన్వీనర్ దేవళ్ల సమ్మయ్య, లోక్ సత్తా రాష్ట్ర నాయకులు నాగరాజు, వివిధ ప్రజా సంఘాలు, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.