
తమిళ స్టార్ హీరో శింబు, జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం 'అరసన్'. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా సమంత నటించనున్నారనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.. ఈ చిత్రం ధనుష్ నటించిన 'వడ చెన్నై' యూనివర్స్ లో భాగం కావడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
'అరసన్'తో సమంత తమిళ రీఎంట్రీ?
ఈ 'అరసన్' చిత్రంలో కీలక పాత్ర కోసం చిత్ర యూనిట్ సమంత రూత్ ప్రభుతో చర్చలు జరుపుతోందని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త కనుక నిజమైతే, సమంత సుమారు మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ తమిళ సినిమాలో నటించినట్లు అవుతుంది . సమంత చివరిసారిగా 2022లో వచ్చిన 'కాతువాకుల రెండు కాదల్' చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి నటించింది. ఈ సినిమా సెట్టయితే, శింబు-సమంత జోడీ దాదాపు 15 సంవత్సరాల తర్వాత మళ్లీ తెరపై సందడి చేయనుంది. వీరిద్దరూ 2010లో వచ్చిన క్లాసిక్ రొమాంటిక్ చిత్రం 'విన్నైతాండి వరువాయా' ( తెలుగులో 'ఏ మాయ చేశావే') లో కలిసి నటించారు. ఇప్పుడు వెట్రిమారన్ దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి నటించడం, అదీ ఒక పవర్‌ఫుల్ 'వడ చెన్నై' బ్యాక్‌డ్రాప్‌లో కావడం అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది.
నో మేకప్ షరతు..
ఈ చిత్రం గురించి మరింత ఆసక్తికరమైన అప్‌డేట్ ఏంటంటే, దర్శకుడు వెట్రిమారన్ తన చిత్రాలలో రియలిజంకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో, 'అరసన్' కోసం సమంతకు ఒక ప్రత్యేకమైన షరతు విధించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె పాత్రలో ఎలాంటి మేకప్ లేకుండా చాలా సహజంగా, వాస్తవికంగా కనిపించాలని దర్శకుడు కోరినట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి సమంత అంగీకరిస్తేనే ఆమెను హీరోయిన్‌గా ఖరారు చేస్తారని తెలుస్తోంది.
'అరసన్' కథా నేపథ్యం..
'అరసన్' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను తన వి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా 'వడ చెన్నై' కథా నేపథ్యాన్ని కలిగి ఉంటుంది. వాస్తవానికి, వెట్రిమారన్ మొదట ధనుష్‌తో తీసిన 'వడ చెన్నై' కథను STR కోసమే రాశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఇప్పుడు, ఆ కథా ప్రపంచంలోనే వేరే ప్రాంతంలో, వేరే కోణంలో ఈ 'అరసన్' కథ నడుస్తుందని వెట్రిమారన్ వెల్లడించారు. అయితే, ధనుష్ పోషించిన అన్బు పాత్ర ఈ చిత్రంలో ఉండదు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారని సమాచారం
వరుస సినిమాలతో సమంత
సమంత విషయానికి వస్తే, ఇటీవల ఆమె వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన హిందీ వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ' బాగా ప్రశంసలు అందుకుంది. ఆమె తదుపరి తెలుగు చిత్రం 'మా ఇంటి బంగారం' షూటింగ్ త్వరలో మొదలు కానుంది. దీంతో పాటు, ఆమె ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' కూడా నిర్మాణ దశలో ఉంది.
ఇక, శింబు విషయానికి వస్తే, ఆయన చివరి చిత్రం కమల్ హాసన్తో కలిసి నటించిన మణిరత్నం డైరెక్షన్ మూవీ 'తుగ్ లైఫ్'. ప్రస్తుతం ఆయన వెట్రిమారన్ 'అరసన్' తో పాటు, 'డ్రాగన్' దర్శకుడు అశ్వత్ మరిముత్తుతో ఒక ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో, ,'STR 50' గా పరిచయం అవుతున్న మరో భారీ ప్రాజెక్ట్‌లో దేశింగ్ పెరియసామి దర్శకత్వంలో నటించడానికి సన్నద్ధమవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు అగ్ర తారలు 'అరసన్' కోసం ఒక్కటయితే, అది తమిళ సినీ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన కలయికల్లో ఒకటిగా నిలిచిపోవడం ఖాయం.