Samantha: సీఎం విజయ్‌ను కలిసిన సమంత.. ‘దళపతికి మరింత పెద్ద లక్ష్యం ఉందంటూ పోస్ట్’

Samantha: సీఎం విజయ్‌ను కలిసిన సమంత.. ‘దళపతికి మరింత పెద్ద లక్ష్యం ఉందంటూ పోస్ట్’

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత తమిళనాడు సీఎం విజయ్‌ను బుధవారం జూన్ 17న చెన్నైలో మర్యాదపూర్వకంగా కలిశారు. మూడు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట చాలా ఏళ్ల తర్వాత మరోసారి కలుసుకోవడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే ఈసారి వారి కలయిక సినిమాల కోసం కాకుండా, ముఖ్యమంత్రిగా ఎన్నికైన విజయ్‌కు అభినందనలు తెలియజేయడం కోసం జరిగింది.

స్క్రీన్‌పై హీరోగా మాత్రమే ఉండాల్సిన వ్యక్తి కాదు..

ఈ భేటీ అనంతరం సమంత సోషల్ మీడియాలో ఫొటోలను పంచుకుంటూ విజయ్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. “ఆయన కేవలం తెరపై హీరోగా మాత్రమే ఉండాల్సిన వ్యక్తి కాదు. మరింత గొప్ప లక్ష్యాల కోసం పుట్టారు” అంటూ ప్రశంసలు కురిపించారు. రాజకీయాల్లోకి రావడానికి ఎంతో ధైర్యం అవసరమని, విజయ్ ప్రయాణం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో“మన జీవితాలు మనం మొదట కలలు కన్న దానికంటే మరింత గొప్పవిగా మారవచ్చు” అని అన్నారు. తన పోస్టులో తమిళనాడు ప్రభుత్వ అధికారిక హ్యాండిల్‌ను కూడా ట్యాగ్ చేశారు.

అలాగే, రాజకీయాల్లోకి విజయ్ అడుగుపెట్టడం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఆమె చెప్పారు. “ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న కెరీర్‌ను పక్కన పెట్టి, మరింత బాధ్యతలతో కూడిన కొత్త రంగంలోకి రావడానికి ఎంతో ధైర్యం కావాలి. సమాజంలో మార్పు తీసుకురాగలననే నమ్మకంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు” అని సమంత రాసుకొచ్చారు. 

అంతేకాకుండా “స్వార్థానికి అతీతంగా సమాజం కోసం పనిచేయాలనే పిలుపును కొద్ది మంది మాత్రమే స్వీకరిస్తారు. విజయ్ తనకు మద్దతుగా నిలిచిన వారినే కాదు, అందరినీ ఆశ్చర్యపరిచే నాయకుడిగా ఎదుగుతారని నేను నమ్ముతున్నాను. ఈ కొత్త ప్రయాణంలో ఆయనకు శక్తి, జ్ఞానం కలగాలని కోరుకుంటున్నాను” అని సమంతా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా..

సమంత, విజయ్ కలిసి ‘కత్తి’ (2014), ‘తెరి’ (2016), ‘మెర్సల్’ (2017) చిత్రాల్లో నటించారు. వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ క్రమంలోంనే మరోసారి వీరిద్దరూ కలిసి నటించాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే సమంత, నందినీ రెడ్డి తెరకెక్కించిన ‘మా ఇంటి బంగారం’ మూవీతో రేపు థియేటర్లలోకి వస్తున్నారు. ఈ చిత్రాన్ని ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, సమంతా, హిమాంక్ దువుర్రు సంయుక్తంగా నిర్మించారు.