Samantha: శ్రీవారి సన్నిధిలో సమంత, శ్రీముఖి.. మొక్కులు తీర్చుకున్న మా ఇంటి బంగారం టీమ్

Samantha: శ్రీవారి సన్నిధిలో  సమంత, శ్రీముఖి.. మొక్కులు తీర్చుకున్న మా ఇంటి బంగారం టీమ్

తిరుమల: టాలీవడ్ టాప్ హీరోయిన్ సమంత ఇవాళ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ రేపు జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో సమంత తన భర్త రాజ్ నిడమానూరుతో పాటుగా మా ఇంటి బంగారం చిత్రబృందంతో కలిసి వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించగా, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా  సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ ఆమె శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సినిమా విడుదలకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషంగా మారింది.

ప్రస్తుతం సమంత తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో సమంత.. యాంకర్ కం నటి శ్రీముఖి, డైరెక్టర్ నందినీ రెడ్డిలతో దిగిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

సమంత - నందిని రెడ్డిమ్యాజిక్ రిపీట్ అవుతుందా?

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓ బేబీ’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ సక్సెస్ ఫుల్ జోడీ ‘మా ఇంటి బంగారం’ కోసం జతకట్టింది. అయితే ఈసారి నందిని రెడ్డి తన మార్కు ఎమోషన్స్‌తో పాటు రాజ్ నిడిమోరు శైలిలో ఉండే ఇంటెన్స్ యాక్షన్‌ను జోడించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ లో చూపించిన విధంగా.. సమంత ఒక సాధారణ మధ్యతరగతి గృహిణి కథలా అనిపించినా, వెనువెంటనే ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి మారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

ముఖ్యంగా బస్సులో చీరకట్టుతో, చేతిలో కత్తి పట్టుకుని రగ్డ్ లుక్‌లో సామ్ చేసిన ఫైట్స్ చూస్తుంటే, ఆమె ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’ అనుభవాన్ని ఇక్కడ వెండితెరపై ప్రదర్శించినట్లు కనిపిస్తోంది. 1980ల నాటి క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ కథలో సమంత బాడీ డబుల్ లేకుండా స్వయంగా స్టంట్స్ చేయడం విశేషం.