పెండ్లికి ఆడ, మగనే అవసరమా?.. వివాహాలపై సీజేఐ చంద్రచూడ్ కామెంట్స్​ 

పెండ్లికి ఆడ, మగనే అవసరమా?.. వివాహాలపై సీజేఐ చంద్రచూడ్ కామెంట్స్​ 
  • పెండ్లికి ఆడ, మగనే అవసరమా?
  • సేమ్ జెండర్​ బంధం ఫిజికల్  రిలేషన్ మాత్రమే కాదు..
  • భావోద్వేగపరమైనది కూడా స్వలింగ
  •  వివాహాలపై సీజేఐ చంద్రచూడ్ కామెంట్స్​ 

న్యూఢిల్లీ : పెండ్లికి వేర్వేరు సెక్స్ కు చెందిన జంటలు (ఆడ, మగ) తప్పనిసరా? అని సుప్రీంకోర్టు చీఫ్  జస్టిస్  డీవై చంద్రచూడ్  ప్రశ్నించారు. సేమ్  సెక్స్  మ్యారేజెస్  అంటే భౌతిక బంధాలు మాత్రమే కాదని, అంతకుమించి స్థిరమైన, భావోద్వేగపరమైన బంధాలు అని ఆయన వ్యాఖ్యానించారు. సేమ్  సెక్స్  మ్యారేజెస్ పై దాఖలైన పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టులో మూడో రోజు వాదనల సమయంలో సీజేఐ ఈ కామెంట్స్ చేశారు. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలంటే పెండ్లికి సంబంధించిన భావనను పునర్ నిర్వచించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘1954లో ప్రత్యేక వివాహ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అద్భుతంగా పరిణామం చెందింది. వ్యక్తిగత చట్టాలు పాటించేందుకు ఇష్టంలేని వారికి సివిల్  మ్యారేజ్  (ప్రభుత్వ అధికారి సమక్షంలో నిర్వహించే పెండ్లి) చేసుకునేందుకు ప్రత్యేక వివాహ చట్టం వీలు కల్పించింది. 

అలాగే హోమోసెక్సువాలిటీ(స్వలింగ సంపర్కం)ని డీక్రిమినలైజ్ చేయడం ద్వారా స్వలింగ సంపర్కుల మధ్య సంబంధాలను గుర్తించాం. అలాంటివారు మరింత స్థిరమైన బంధాల్లో ఉన్నట్లు గమనించాం” అని సీజేఐ అన్నారు. ఈ విషయంలో ట్రోలింగ్ కు గురవుతానని తెలిసినా.. తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని తెలిపారు. ఆడ, మగ వివాహ బంధంలో గృహ హింస జరిగితే పిల్లలు సాధారణ వాతావరణంలో పెరుగుతారా? అని ప్రశ్నించారు. పిల్లలపై స్వలింగ వివాహాల ప్రభావంపై స్పందిస్తూ.. జనాల్లో చదువుకున్న వారు ఎక్కువయ్యారని,  చాలా జంటలు పిల్లలు కోరుకోకుండా ఉండడమో లేదా ఒకే పిల్లవాడితో సంతృప్తి చెందడమో జరుగుతోందన్నారు. మగపిల్లవాడే కావాలన్న ఆలోచన కూడా విడిచిపెడుతున్నారని చెప్పారు. 

దీనిపై పార్లమెంట్లోనే చర్చించాలి: కేంద్రం

సేమ్ సెక్స్  మ్యారేజెస్ పై దాఖలైన్  పిటిషన్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి వ్యతిరేకించింది. ఇవి ‘పట్టణ ప్రాంతాల్లోని ఉన్నత వర్గాల వారి అభిప్రాయాలు’ గా అభివర్ణించింది. స్వలింగ వివాహాలపై చర్చించేందుకు పార్లమెంటే సరైన వేదిక అని పేర్కొంది.  సంప్రదాయ భారతీయ కుటుంబాలతో స్వలింగ  వివాహాలను పోల్చలేమని స్పష్టం చేసింది.