సమ్మక్క మొక్కుల సందడి.. కోళ్లు, మేకలకు పెరిగిన డిమాండ్

సమ్మక్క మొక్కుల సందడి.. కోళ్లు, మేకలకు పెరిగిన డిమాండ్
  • గతంలో రూ.8 వేల మేకకు ఇప్పుడు రూ.10 వేలు
  • ఒక్కో మేకపై రూ.2 వేలకు పైగా పెంపు 
  • మార్కెట్​లో లోకల్ జీవాలకు కొరత
  • మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి తెస్తున్న వ్యాపారులు
  • జిల్లాలో రోజుకు 5 వేల వరకు అమ్మకాలు

మంచిర్యాల, వెలుగు : జిల్లాలో సమ్మక్క మొక్కుల సందడి మొదలైంది. రెండేళ్లకోసారి వచ్చే జాతర సందర్భంగా అమ్మవారికి నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి కోళ్లు, మేకలను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. మేడారంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈనెల 28 నుంచి 31 వరకు జాతరలు జరగనున్నాయి. చాలామంది భక్తులు జాతరకు ముందు బంగారం సమర్పించి కోళ్లు, మేకలను మొక్కుతారు. ఆ తర్వాత జాతరలో అమ్మవార్ల దర్శనం చేసుకుంటారు. ఈ క్రమంలో జిల్లాలో గత 15 రోజులుగా సమ్మక్క మొక్కుల సందడి నెలకొంది. దీంతో ఒక్కసారిగా కోళ్లు, మేకలకు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా వ్యాపారులు మేకల ధరలను అమాంతం పెంచేశారు. 

రూ.2 వేలకు పైగా పెంపు..

గతంలో లోకల్ మేక లైవ్ కిలో రూ.400 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.500 పైనే పలుకుతోంది. మహారాష్ట్ర, రాజస్థాన్ మేకలు లైవ్ రూ.300 నుంచి రూ.350 కిలో అమ్మేవారు. ప్రస్తుతం వాటికి కూడా కిలోకు రూ.50 నుంచి రూ.100 వరకు పెంచారు. ఈ లెక్కన గతంలో 20 కిలోల లోకల్ మేక రూ.8 వేలకు దొరికితే ఇప్పుడు రూ.10 వేల  నుంచి రూ.11 వేలకు అమ్ముతున్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్ మేకలు రూ.6 వేల నుంచి రూ.7 వేల లోపే దొరికేవి. ప్రస్తుతం వాటికి రూ.8 వేల దాకా పలుకుతోంది. ఒక్కో మేకపై రూ.2 వేలకు పైగా పెరగడంతో కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ ధరకైనా కొనుగోలు చేసి మొక్కలు తీర్చుకుంటున్నామని పలువురు పేర్కొంటున్నారు. ఇక మేకపోతు(యాట)లకు రూ.15 వేలకు పైగా ధర పలుకుతోంది. 

మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి దిగుమతి..

జిల్లాలో డిమాండ్​కు సరిపడా సప్లై లేకపోవడంతో వ్యాపారులు ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి మేకలను భారీ సంఖ్యలో దిగుమతి చేసుకుంటున్నారు. వాటిని జిల్లాలోని వివిధ మార్కెట్లతోపాటు అనుమతి పొందిన మేకల మండీల్లో అమ్ముతున్నారు. సమ్మక్క మొక్కుల నేపథ్యంలో మంచిర్యాల, మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, నస్పూర్, రామకృష్ణాపూర్ కోల్​బెల్ట్ ప్రాంతాల్లో మేకలకు అధిక డిమాండ్ ఏర్పడింది. 

రోజుకు 5 వేల దాకా అమ్మకం..

జిల్లాలోని తాండూర్​లో ప్రతి శనివారం మేకల సంత పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ మార్కెట్​కు ఆసిఫాబాద్​, తిర్యాణి ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో మేకలు అమ్మకానికి వస్తాయి. ఇక్కడ దొరికే లోకల్​ మేకలను మంచిర్యాల, గోదావరిఖని, పెద్దపల్లి, కరీనంగర్, వరంగల్​ ప్రాంతాల వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. అలాగే మంచిర్యాల, మందమర్రిలో మున్సిపల్​అనుమతి పొందిన మేకల మండీల్లో నిత్యం మేకల అమ్మకాలు జరుపుతారు. పాత మంచిర్యాలలోని మేకల మండీలో గతంలో రోజుకు వంద మేకలు అమ్మితే, ప్రస్తుతం రోజుకు 500 వరకు అమ్ముతున్నామని నిర్వాహకులు తెలిపారు. సమ్మక్క జాతర సీజన్​లో జిల్లాలో రోజుకు 5 వేల దాకా అమ్మకాలు జరుగుతున్నాయని అంచనా. జాతర ముగిసిన తర్వాత కూడా మేకలకు కొరత ఏర్పడే అవకాశం ఉండడంతో మరో నెల రోజుల వరకు ఇవే ధరలు కొనసాగుతాయని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.