- సీఎం రేవంత్‌పై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం: ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్
హైదరాబాద్, వెలుగు: ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీమ్)పై పాలమూరు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మండిపడ్డారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డిపై, స్థానిక కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇది సరైన విధానం కాదన్నారు. సీఎంను పట్టుకొని తొక్కుతాం అని మాట్లాడడం వారి రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు. వారు రాజోలి బండకు కాకుండా తుమ్మిళ్లకు, మల్లమ్మ కుంటకు వచ్చి ఉంటే ఎవరిని ఎవరు తొక్కుతారో తెలిసేదని హెచ్చరించారు. ఇప్పటికైనా రాజకీయాల్లో స్థాయిని మరిచి మాట్లాడడం సరైంది కాదని, సీఎం రేవంత్ పై మరోసారి ఇలాంటి విమర్శలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని సంపత్ కుమార్ హెచ్చరించారు.
