సామాన్యుడు కింగ్ అయితే..?

సామాన్యుడు కింగ్ అయితే..?

ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారింది. ఫార్ములా సినిమాలను కాకుండా, ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌ కూడా రియల్‌‌ లైఫ్‌‌కి దగ్గరగా ఉంటేనే చూస్తున్నారు. అలాంటి సినిమానే ‘మార్టిన్ లూథర్ కింగ్’ అన్నారు నరేష్. సంపూర్ణేష్ బాబు లీడ్‌‌ రోల్‌‌లో పూజ కొల్లూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దర్శకుడు వెంకటేష్ మహా.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు.  అక్టోబర్ 27న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ‘మెసేజ్‌‌, ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌ రెండూ ఉండే సినిమాలు రావడం అరుదు.

ఇందులో ఆ రెండూ ఉన్నాయి. ఓవైపు నవ్వుకుంటూనే మరోవైపు టెన్షన్ పడుతుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే రియాలిటీకి దగ్గరగానూ ఉంటుంది. ప్రతి పాత్రకి కొత్తదనం ఉంటుంది. సంపూకి ఇది సెకండ్ లైఫ్ అవుతుంది. నేను, వెంకటేష్ మహా ముఖ్య పాత్రలు పోషించాం. వారసత్వంగా గ్రామ సర్పంచ్ అవ్వాలనుకునే పాత్ర నాది. అలాగే మహా పాత్ర మరో వర్గం.

తను రాసిన స్క్రిప్ట్ ఈ చిత్రానికి ప్రధాన బలం. దర్శకురాలు అద్బుతంగా తీశారు. సామాన్యుడు కింగ్ అయినప్పుడే సమాజం బాగుపడుతుంది అనేది చూపించారు. సరిగ్గా ఎన్నికల సీజన్‌‌లో విడుదలవుతుంది. యూత్‌ని బాగా మెప్పిస్తుందని అనుకుంటున్నాను’ అని అన్నారు.