V6 News

సాహో శాంసన్..ఈ సీజన్ లో రెండో సెంచరీ.. ముంబైపై చెన్నై గ్రాండ్‌‌ విక్టరీ

సాహో శాంసన్..ఈ సీజన్ లో రెండో సెంచరీ.. ముంబైపై చెన్నై గ్రాండ్‌‌ విక్టరీ
  • ఈ సీజన్‌‌‌‌లో సంజూ రెండో సెంచరీ 
  • 103 రన్స్‌‌‌‌ తేడాతో ముంబైపై చెన్నై గ్రాండ్‌‌‌‌ విక్టరీ
  •     అకీల్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌కు 4 వికెట్లు
  •     ముంబై బ్యాటర్లు అట్టర్‌‌‌‌ ఫ్లాఫ్‌‌‌‌

   

ముంబై: ఐపీఎల్‌‌‌‌–19లో చెన్నై సూపర్‌‌‌‌కింగ్స్‌‌‌‌ స్టార్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ సంజూ శాంసన్‌‌‌‌ (54 బాల్స్‌‌‌‌లో 10 ఫోర్లు, 6 సిక్స్‌‌‌‌లతో 101 నాటౌట్‌‌‌‌) మరోసారి అదరగొట్టాడు. ముంబై టాప్‌‌‌‌ బౌలర్లను ఉతికేస్తూ ఈ సీజన్‌‌‌‌లో రెండో సెంచరీతో మెరిశాడు. ఫలితంగా గురువారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో చెన్నై 103 రన్స్‌‌‌‌ తేడాతో ముంబై ఇండియన్స్‌‌‌‌పై గెలిచింది. టాస్‌‌‌‌ ఓడిన చెన్నై 20 ఓవర్లలో 207/6 స్కోరు చేసింది. ఛేజింగ్‌‌‌‌లో ముంబై 19 ఓవర్లలో 104 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. తిలక్‌‌‌‌ వర్మ (29 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లతో 37), సూర్యకుమార్‌‌‌‌ (30 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లతో 35) మినహా మిగతా వారు నిరాశపర్చారు. అకీల్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ (4/17) దెబ్బకు ముంబై లైనప్‌‌‌‌ పేకమేడలా కూలింది. శాంసన్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

శాంసన్‌‌‌‌ ఒక్కడే..

ఫ్లాట్‌‌‌‌ పిచ్‌‌‌‌పై బ్యాటింగ్‌‌‌‌కు దిగిన చెన్నైకి శాంసన్‌‌‌‌ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. ఓ ఎండ్‌‌‌‌లో వికెట్లు పడినా.. తను మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. సింగిల్‌‌‌‌, ఫోర్‌‌‌‌తో తొలి ఓవర్‌‌‌‌ను ముగించగా.. హార్దిక్‌‌‌‌ పాండ్యా వేసిన రెండో ఓవర్‌‌‌‌లో రుతురాజ్‌‌‌‌ (22) 4, 4, 6తో 19 రన్స్‌‌‌‌ రాబట్టాడు. కానీ తర్వాతి ఓవర్‌‌‌‌లో మరో ఫోర్‌‌‌‌ కొట్టి గజన్‌‌‌‌ఫర్ (2/25)కు వికెట్‌‌‌‌ ఇచ్చాడు. దాంతో తొలి వికెట్‌‌‌‌కు 32 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ అయ్యింది. పాండ్యా వేసిన నాలుగో ఓవర్‌‌‌‌లో శాంసన్‌‌‌‌ 4, 6, 4, 4తో 19 రన్స్‌‌‌‌ దంచాడు. సర్ఫరాజ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (14) మూడు ఫోర్లు కొట్టి ఆరో ఓవర్‌‌‌‌లో వెనుదిరగగా, శాంసన్‌‌‌‌ సిక్స్‌‌‌‌తో పవర్‌‌‌‌ప్లేలో సీఎస్కే 73/2 స్కోరు చేసింది. ఫీల్డింగ్‌‌‌‌ను సడలించిన తర్వాత కూడా శాంసన్‌‌‌‌ జోరు తగ్గలేదు. 6, 4తో రెచ్చిపోయాడు. 

కానీ 9వ ఓవర్‌‌‌‌లో శివమ్‌‌‌‌ దూబే (5) ఔట్‌‌‌‌తో చెన్నై స్కోరు 91/3గా మారింది. పదో ఓవర్‌‌‌‌లో బ్రెవిస్‌‌‌‌ (21) రెండు సిక్స్‌‌‌‌లు కొట్టడంతో సూపర్‌‌‌‌కింగ్స్‌‌‌‌ స్కోరు 113/3 గా మారింది. 11వ ఓవర్‌‌‌‌లో ఫోర్‌‌‌‌తో శాంసన్‌‌‌‌ 26 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా, బ్రెవిస్‌‌‌‌ ఫోర్‌‌‌‌ కొట్టి అశ్విన్‌‌‌‌ కుమార్‌‌‌‌ (2/37) ఓవర్‌‌‌‌లో ఔటయ్యాడు. నాలుగో వికెట్‌‌‌‌కు 33 రన్స్‌‌‌‌ జతయ్యాయి. ఈ దశలో వచ్చిన కార్తీక్‌‌‌‌ శర్మ (18) మెరుగ్గా ఆడాడు. సింగిల్స్‌‌‌‌తో స్ట్రయిక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేస్తూనే 14వ ఓవర్‌‌‌‌లో రెండు సిక్స్‌‌‌‌లు బాదాడు. 15 ఓవర్లలో సీఎస్కే స్కోరు 149/4కు పెరిగింది. 17వ ఓవర్‌‌‌‌లో శాంసన్‌‌‌‌ 6, 4, 4తో 15 రన్స్‌‌‌‌ రాబట్టాడు. తర్వాతి ఓవర్‌‌‌‌లో బుమ్రా (1/31) దెబ్బకు కార్తీక్‌‌‌‌ ఔట్‌‌‌‌ కావడంతో ఐదో వికెట్‌‌‌‌కు 43 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఓవర్టన్‌‌‌‌ (15) 4, 4, 6 కొట్టి 18వ ఓవర్‌‌‌‌లో వికెట్‌‌‌‌ ఇచ్చాడు. 19వ ఓవర్‌‌‌‌లో బుమ్రా.. శాంసన్‌‌‌‌ను కట్టడి చేసినా 4తో 10 రన్స్‌‌‌‌ రాబట్టాడు. ఆఖరి ఓవర్‌‌‌‌లో శాంసన్‌‌‌‌ 6, 6, 6తో 54 బాల్స్‌‌‌‌లో సెంచరీ కొట్టి భారీ స్కోరు అందించాడు. 

బౌలర్లు అదుర్స్‌‌‌‌..

ఛేజింగ్‌‌‌‌లో ముంబై స్టార్లను చెన్నై బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ఇన్నింగ్స్‌‌‌‌ ఆరో బాల్‌‌‌‌కే డానిష్‌‌‌‌ మాలెవర్‌‌‌‌ (0)ను డకౌట్‌‌‌‌ చేసిన అకీల్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ తన తర్వాతి ఓవర్‌‌‌‌లో నమన్‌‌‌‌ ధీర్‌‌‌‌ (0)ను కూడా డకౌట్‌‌‌‌ చేశాడు. రెండో ఓవర్‌‌‌‌లో హార్డ్‌‌‌‌ హిట్టర్‌‌‌‌ డికాక్‌‌‌‌ (7) ముకేశ్‌‌‌‌ చౌదరీ (1/31) పెవిలియన్‌‌‌‌కు పంపడంతో ముంబై 11/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక్కడి నుంచి ఇన్నింగ్స్‌‌‌‌ను ఆదుకునే బాధ్యత తీసుకున్న సూర్యకుమార్‌‌‌‌, తిలక్‌‌‌‌ వర్మ  మెల్లగా ఆడటంతో పవర్‌‌‌‌ప్లేలో ముంబై 29/3 స్కోరుకే పరిమితమైంది. అయితే 8వ ఓవర్‌‌‌‌లో సూర్య మూడు ఫోర్లతో ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయగా, 10వ ఓవర్‌‌‌‌లో తిలక్‌‌‌‌ కూడా రెండు బౌండ్రీలతో కుదురుకున్నట్లు కనిపించాడు. 69/3తో ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌ ఓవర్స్‌‌‌‌ను ముగించిన ముంబైకి 13వ ఓవర్‌‌‌‌లో తిలక్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి హుస్సేన్‌‌‌‌ మళ్లీ షాకిచ్చాడు. తర్వాతి ఓవర్‌‌‌‌లో నూర్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ (2/23) డబుల్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌ ఇచ్చాడు. వరుస బాల్స్‌‌‌‌లో హార్దిక్‌‌‌‌ పాండ్యా (1), రూథర్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌ (0) వికెట్లు తీశాడు. నాలుగు బాల్స్‌‌‌‌ తేడాలో మూడు కీలక వికెట్లు పడటంతో ముంబై 85/6తో ఎదురీత మొదలుపెట్టింది. 14వ ఓవర్‌‌‌‌లో సూర్యను హుస్సేన్‌‌‌‌ ఔట్‌‌‌‌ చేయడంతో స్కోరు 87/7గా మారింది. చేయాల్సిన రన్‌‌‌‌ రేట్‌‌‌‌ పెరిగిపోవడంతో శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ (6), క్రిష్‌‌‌‌ భగత్‌‌‌‌ (7), బుమ్రా (2) చేతులెత్తేశారు. 
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లలో 207/6 (శాంసన్‌‌‌‌ 101*, రుతురాజ్‌‌‌‌ 22, గజన్‌‌‌‌ఫర్‌‌‌‌ 2/25), ముంబై: 19 ఓవర్లలో 104 ఆలౌట్‌‌‌‌ (తిలక్‌‌‌‌ 37, సూర్య 35, అకీల్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ 4/17).