శాంసంగ్ కంపెనీలో సమ్మె సైరన్ : 18 రోజులు నిలిచిపోనున్న ఉత్పత్తి.. లక్షల కోట్ల నష్టం..

శాంసంగ్ కంపెనీలో సమ్మె సైరన్ : 18 రోజులు నిలిచిపోనున్న ఉత్పత్తి.. లక్షల కోట్ల నష్టం..

శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ యాజమాన్యం చర్చలకు రమ్మని పిలిచినా కార్మిక సంఘం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. ముందే ప్రకటించినట్లుగా వచ్చే వారం నుండి 18 రోజుల పాటు భారీ సమ్మె చేయబోతున్నట్లు యూనియన్ స్పష్టం చేసింది.

ప్రపంచంలోనే అతిపెద్ద మెమరీ చిప్ తయారీ సంస్థ అయిన శాంసంగ్‌లో బోనస్‌ల విషయంలో యాజమాన్యానికి, కార్మికులకు మధ్య కొంత కాలంగా గొడవ జరుగుతోంది. ఏ షరతులు లేకుండా చర్చలు జరుపుదామని కంపెనీ ప్రతిపాదించినా, యూనియన్ మాత్రం తమ డిమాండ్లు నెరవేర్చే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పింది.

 డిమాండ్లు ఏంటంటే ?
*కంపెనీకి వచ్చే లాభాల్లో 15 శాతం బోనస్‌గా ఇవ్వాలని, అలాగే బోనస్ చెల్లింపులపై ఉన్న పరిమితులను తొలగించాలని యూనియన్ కోరుతోంది.
*యాజమాన్యం మాత్రం 10 శాతం లాభాన్ని బోనస్ పూల్‌గా ఉంచుతామని, కొత్త రకమైన ఇన్సెంటివ్ విధానాన్ని తెస్తామని చెబుతోంది. కానీ దీనికి యూనియన్ ఒప్పుకోవడం లేదు.

సమ్మె ప్రభావం 
వచ్చే గురువారం నుండి ప్రారంభమయ్యే ఈ సమ్మె వల్ల మెమరీ చిప్‌ల తయారీ ఆగిపోయే ప్రమాదం ఉంది. సుమారు 41 వేల నుండి 50 వేల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సమ్మె జరిగితే దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థకు సుమారు 66.7 బిలియన్ డాలర్ల అంటే లక్ష కోట్ల  నష్టం వాటిల్లవచ్చని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వం, కంపెనీ స్పందన:
కంపెనీ అధికారులు ఈ సమ్మె  వల్ల ప్రజలకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు చెప్పారు. "మేమంతా ఒకే కుటుంబం, చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుందాం" అని కోరారు. మరోవైపు, దేశ ఆర్థిక వృద్ధి దెబ్బతింటుందని దక్షిణ కొరియా ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

►ALSO READ | డబ్బుల కోసం మర్డర్స్ చేసే కిరాతకులు ఆ దేశంలోనే దాక్కుంటున్నారు.. యూకే ఆందోళన!

ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల శాంసంగ్ చిప్‌లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. 2026 మొదటి మూడు నెలల్లోనే కంపెనీ ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇంత లాభాల్లో ఉన్న సమయంలో తమకు సరైన బోనస్ ఇవ్వాలని కార్మికులు పట్టుబడుతున్నారు. జూన్ 7న సమ్మె ముగిసిన తర్వాతే తదుపరి చర్చలకు వస్తామని యూనియన్ నేత చోయ్ సియోంగ్-హో స్పష్టం చేశారు.