బ్రిటన్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ నేరగాళ్లకు స్పెయిన్ ఇక ఎంతమాత్రం సురక్షిత స్థావరం కాదని యూకే జాతీయ నేర సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. స్పెయిన్‌లో నక్కిన హంతకులు, డ్రగ్స్ స్మగ్లర్లు, భారీ ఆర్థిక నేరగాళ్లే లక్ష్యంగా ఎన్‌సీఏ, స్పెయిన్ పోలీసులు, క్రిమ్‌స్టాపర్స్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా 12 మంది పరారీలో ఉన్న నేరగాళ్ల కొత్త లిస్ట్ విడుదల చేశాయి. బ్రిటీష్ నేరగాళ్లను పట్టుకునేందుకు రెండు దశాబ్దాలుగా విజయవంతంగా సాగుతున్న ‘ఆపరేషన్ కాప్చురా’ 20వ వార్షికోత్సవం సందర్భంగా దీని విడుదల జరిగింది.
స్పెయిన్‌లో స్థిరపడిన వేలాది మంది బ్రిటీష్ వలసదారులు, పర్యాటకులు ఈ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఈ ప్రమాదకర నేరగాళ్లు సాధారణ పౌరుల్లా నటిస్తూ స్పెయిన్‌లోని మార్బెల్లా, మాలాగా, అలకాంటే, టెనెరిఫే వంటి పర్యాటక ప్రాంతాల్లోని బ్రిటీష్ కమ్యూనిటీల్లో కలిసిపోతుంటారని పేర్కొన్నారు. అంతేకాకుండా పోలీసుల కళ్లు కప్పేందుకు నకిలీ గుర్తింపు కార్డులు, ఫోర్జరీ పాస్‌పోర్టులు వాడటమే కాకుండా.. కొందరు సర్జరీల ద్వారా తమ ముఖ రూపురేఖలను కూడా మార్చుకుంటున్నారని ఎన్‌సీఏ వెల్లడించింది.
ఈ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఘోరమైన నేరాలకు పాల్పడిన వారున్నారు. 2007లో గ్లాస్గోలో జరిగిన థామస్ కామెరాన్ హత్య కేసులో నిందితుడైన డెరెక్ మెక్‌గ్రా ఫెర్గూసన్, అలాగే ఇద్దరి హత్య కేసుల్లో నిందితుడైన కెవిన్ థామస్ పార్లే ఈ లిస్టులో ప్రముఖంగా ఉన్నారు. వీరితో పాటు భారీ ఎత్తున కొకైన్ స్మగ్లింగ్, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సైమన్ డట్టన్, చార్లీ సాలిస్‌బరీ, స్పెన్సర్ డిల్లాన్ ల్యాంబ్ వంటి డ్రగ్ కింగ్‌పిన్స్ కూడా ఉన్నారు.
►ALSO READ | ఒమన్ తీరంలో భారత నౌకపై డ్రోన్ దాడి.. మునిగిపోయిన గుజరాత్ కార్గో షిప్
ఇక అమాయకులను మోసం చేసి కోట్లాది రూపాయల లైఫ్ సేవింగ్స్ దోచుకున్న కేటుగాళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. మోడలింగ్ కెరీర్ ఆశ చూపి మోసం చేసిన ఫిలిప్ బారీ ఫోస్టర్ , నకిలీ పన్ను క్లెయిమ్‌లతో ప్రభుత్వానికే కన్నం వేసిన డీన్ ఐటీన్ , 2022 నాటి మల్టీ-మిలియన్ పౌండ్ల మనీ లాండరింగ్ కేసులో నిందితుడైన రష్యన్ జాతీయుడు అలెక్సాండర్ కుక్సోవ్ ల కోసం గాలింపు ముమ్మరం చేసింది యూకే.
గడిచిన 20 ఏళ్లలో ఆపరేషన్ కాప్చురా ద్వారా 111 మంది ప్రకటించిన నేరగాళ్లలో 98 మందిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టారు. గత ఏడాది కాలంలోనే 56 మందిని స్పెయిన్ నుండి యూకేకి అప్పగించారు. ఈ నేరగాళ్లు ఎవరైనా కనిపిస్తే నేరుగా పట్టుకునే ప్రయత్నం చేయకుండా.. క్రైమ్‌స్టాపర్స్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరింది బ్రిటన్. ఈ నేరగాళ్లను ఎక్కడ దాక్కున్నా వదిలే ప్రసక్తే లేదని వెతికి వెంటాడి పట్టుకుంటామని ఎన్‌సీఏ డైరెక్టర్ రాబ్ జోన్స్ వార్నింగ్ ఇచ్చారు.
