స్టాండ్ అలోన్ మెడికల్ పీజీ కాలేజీగా సనత్ నగర్ టిమ్స్!

స్టాండ్ అలోన్ మెడికల్ పీజీ కాలేజీగా సనత్ నగర్ టిమ్స్!
  • అల్వాల్, కొత్తపేట టిమ్స్ కు భిన్నంగా ప్రత్యేక అకడమిక్ సెటప్  
  • ఎంబీబీఎస్ లేకుండా నేరుగా పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు
  • సుమారు 100 నుంచి 150 వరకు పీజీ మెడికల్ సీట్లు వచ్చే  చాన్స్​ 
  • విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఐదంతస్తుల బిల్డింగ్ 
  • 29 హెల్త్​ డిపార్ట్మెంట్లు.. 200 సీట్ల కెపాసిటీ గల లెక్చర్ హాల్ 
  • జూన్ మొదటివారంలో  సేవలు ప్రారంభించే అవకాశం 

హైదరాబాద్, వెలుగు: హైదరబాద్ లోని సనత్ నగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టీఐఎంఎస్) ను కేవలం ఒక సూపర్ స్పెషాలిటీ  హాస్పిటల్ గానే కాకుండా, స్టాండ్ అలోన్ మెడికల్ పీజీ కాలేజీగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

ప్రస్తుతం రాష్ట్రంలో అటనామస్ హోదాతో నిమ్స్ (ఎన్ఐఎంఎస్) మాత్రమే ఈ పీజీ కోర్సులతో సేవలు అందిస్తుండగా, త్వరలోనే సనత్ నగర్ టీమ్స్ కూడా స్టాండ్ అలోన్ పీజీ  మెడికల్ కాలేజీ ఆ లిస్టులో చేరనుంది. సాధారణంగా ఒక మెడికల్ కాలేజీ అంటే ఎంబీబీఎస్ సీట్లతో మొదలై, ఆ తర్వాత పీజీ కోర్సులు ప్రారంభమవుతాయి.

కానీ, ఈ స్టాండ్ అలోన్ పీజీ మెడికల్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉండవు. నేరుగా పీజీ (ఎండీ, ఎంఎస్), సూపర్ స్పెషాలిటీ (డీఎం, ఎంసీహెచ్) విద్యార్థులు మాత్రమే ఇక్కడ ఉంటారు. స్టాండ్ అలోన్ పీజీ మెడికల్ కాలేజీలు ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పడతాయి కాబట్టి... సంస్థలకు సొంత యూనివర్సిటీ హోదా ఉంటుంది. ఇవి ఏ ఇతర వర్సిటీతో సంబంధం లేకుండా స్వతంత్రంగా టైమ్‌‌‌‌ టేబుల్, పరీక్షలను నిర్వహించుకుంటాయి. దీనివల్ల టీచింగ్ ఫ్యాకల్టీ పూర్తిస్థాయిలో రీసెర్చులు, క్లిష్టమైన చికిత్సలపైనే దృష్టి సారించే 
అవకాశం ఉంటుంది.

అల్వాల్, కొత్తపేట టిమ్స్ లకు భిన్నంగా... 

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్మిస్తున్న మూడు టీమ్స్ హాస్పిటల్స్ లో సనత్ నగర్ అకడమిక్ సెటప్ భిన్నంగా ఉండనున్నది. అల్వాల్ లోని టిమ్స్ హాస్పిటల్ ను కుత్బుల్లాపూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి, కొత్తపేట టిమ్స్ ను మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా మార్చాలని సర్కారు భావిస్తున్నది. అంటే ఆయా మెడికల్ కాలేజీల విద్యార్థులకు ఇవి టీచింగ్ హాస్పిటల్స్ గా పనిచేస్తాయి.

అయితే, సనత్ నగర్ టిమ్స్ మాత్రం ఏ ఇతర కాలేజీపై ఆధారపడకుండా స్వతంత్రంగా తన అకడమిక్ హోదాను కలిగి ఉంటుంది. ఇక్కడ ఎంబీబీఎస్ విద్యార్థుల తాకిడి లేకపోవడం వల్ల సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండి పేషెంట్లకు అత్యున్నత స్థాయి వైద్యం అందిస్తారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పీజీఐ చండీగఢ్, ఉత్తరప్రదేశ్ లోని సంజయ్ గాంధీ పీజీ ఇనిస్టిట్యూట్ వంటి సంస్థల నమూనాలో ఈ స్టాండ్ అలోన్ విధానం పనిచేస్తుంది.

అధునాతన అకాడమిక్ బ్లాక్...

కేవలం హాస్పిటల్ బిల్డింగ్స్ మాత్రమే కాకుండా.. పీజీ విద్యార్థుల విద్యా అవసరాల కోసం ప్రత్యేకంగా ఐదు అంతస్తుల అకాడమీ బ్లాక్ ను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ఇందులో 200 మంది కూర్చునే సామర్థ్యం గల లెక్చర్ హాల్ తో పాటు అధునాతన ల్యాబ్ లు, రీసెర్చ్ సెంటర్లు ఉండనున్నాయి. డాక్టర్ల కోసం హాస్పిటల్ ఆవరణలోనే  వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. రోగుల సహాయకుల కోసం 196 జనరల్ బెడ్లు, 30 పెయిడ్ బెడ్లతో కూడిన ధర్మశాల బిల్డింగ్ నిర్మించారు. రోజుకు 8వేల మందికి భోజన వసతి కల్పించగల అతిపెద్ద కిచెన్ కూడా ఇక్కడ అందుబాటులోకి రానుంది. ఇవన్నీ ఒక స్టాండ్ అలోన్ ఇన్ స్టిట్యూట్ కు ఉండాల్సిన అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు నిదర్శనం.

100 నుంచి 150 పీజీ సీట్లకు అవకాశం..

నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) రూల్స్ ప్రకారం.. ఒక సంస్థలో పీజీ సీట్లు రావాలంటే అక్కడ బెడ్ల సంఖ్య, రోగుల రద్దీ, అధునాతన ఆపరేషన్ థియేటర్లు ప్రామాణికంగా ఉంటాయి. సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ లో మొత్తం వెయ్యి బెడ్లు అందుబాటులో ఉండగా, అందులో ఏకంగా 300 బెడ్లు కేవలం ఐసీయూ విభాగానికే కేటాయించారు. అలాగే 29 మేజర్ ఆపరేషన్ థియేటర్లు, 8 మైనర్ ఓటీలు ఉండటం విశేషం. ఈ భారీ సామర్థ్యం దృష్ట్యా, ఇక్కడ సుమారు 100 నుంచి 150 వరకు పీజీ సీట్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నెఫ్రాలజీ, కార్డియాలజీ, న్యూరో సర్జరీ, ఆంకాలజీ వంటి 29 కీలక సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో నిపుణులైన డాక్టర్లు ఇక్కడ తయారవుతారు.

జూన్ మొదటి వారంలో... 

సనత్ నగర్ టిమ్స్ లో కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్, క్యాన్సర్ రోగుల కోసం రేడియేషన్ ఆంకాలజీ, లీనాక్ వంటి టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నారు. ప్రస్తుతం ఈ టిమ్స్ లో ఈ నెల 1 నుంచి ట్రయల్ రన్ విజయవంతంగా నడుస్తున్నది. జూన్ 2 రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం నుంచే అన్ని సేవలను అధికారికంగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఆరోజు వీలుకాకుంటే... జూన్ 2 నుంచి 12 మధ్యన ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సనత్ నగర్ టిమ్స్ అందుబాటులోకి వస్తే నిమ్స్, గాంధీ, ఉస్మానియాపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, రాష్ట్ర ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందుతుంది.